● రైతుకు తెలియకుండా పొలంలో
ఫారంపాండ్ పనులు
● న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో బాధితుడు ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోటలో టీడీపీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి వాటర్‌షెడ్ అధికారులను కను సైగలతో శాసిస్తూ ఇష్టారాజ్యంగా ఫారంపాండ్ పనులు చేసి రూ.లక్షల ప్రజాధనంతో జేబులు నింపుకొంటున్నాడు. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, పక్క మండలాల్లో కాపురాలు ఉంటూ వ్యవసాయ భూములు కలిగిన రైతుల భూములను గుర్తించడం.. వారికి కనీస సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. ఇదేమిటని రైతులు ఎవరైనా గట్టిగా నిలదీస్తే బిల్లులు కాగానే రూ.లక్షల అంచనాతో చేపట్టిన ఫారంపాండ్ గుంతలను పూడ్చేస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడంతో ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉదాహరణకు బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న ఎంఎస్.అమీర్ బాబా అనే రైతుకు మండలంలోని సంపతికోట పంచాయతీ సమీపంలోని ఎర్రవంక వద్ద ఉన్న సర్వే నంబర్ 554/1లో 5.05 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలంలో బోరు లేనందున రైతు కేవలం ఖరీఫ్ సీజన్‌లో మాత్రమే పొలం వద్దకు వచ్చేవారు. అయితే సదరు టీడీపీ నాయకుడు భూమి కలిగి ఉన్న రైతుకు కనీస సమాచారం ఇవ్వకుండా వాటర్‌షెడ్ ద్వారా రూ.1.85 లక్షల అంచనాతో ఫారంపాండ్ పనులు పూర్తి చేసేశాడు. ఇటీవల విషయం తెలుసుకున్న బాధిత రైతు తన పొలంలో ఎందుకు ఫారంపాండ్ పనులు చేపట్టావని ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేయడమే గాక నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని వాపోయాడు. ఈ విషయంపై తాను వాటర్‌షెడ్ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని ఈ నెల 25న మదనపల్లిలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశానని రైతు మంగళవారం పేర్కొన్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో కూడా ఇదే పంచాయతిలోని వల్లీసాబ్ అనే రైతు పొలంలో ఇలాంటి పనులు చేపట్టి బిల్లులయ్యాక జేసీబీ యంత్రంతో గుంతలు పూడ్చేసి రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసినా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఈ విషయంపై వాటర్‌షెడ్ పీవో ఖాజా మొహిద్దీన్‌ను వివరణ కోరగా.. ఇలాంటి పనులు ఎవరు, ఎన్ని చేపట్టినా వారి డిపాజిట్ సొమ్ము నుంచి రికవరీ చేసుకుంటామని, ఈ విషయం డ్వామా పీడీ దృష్టికి కూడా వెళ్లిందని, సమగ్రమైన విచారణ చేపడతామన్నారు.


