రైతు భరోసా కేంద్రం శిలాఫలకం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా కేంద్రం శిలాఫలకం ధ్వంసం

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

రాయచోటి : వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేని కొంత మంది ఆకతాయిలు విధ్వంసాలకు దిగుతున్నారు. తాజాగా రాయచోటి రూరల్‌ మండలం మాధవరం గ్రామంలో నిర్మించిన వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ రంగ సేవలను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది. గ్రామ గ్రామాన లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు, అందులోని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఈ కేంద్రాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఇప్పటికే అనేక ప్రాంతాలలో స్థానికంగా ఉన్న కొంత మంది కూటమి పార్టీలకు చెందిన ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మాధవరం గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది.

కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

మదనపల్లె టౌన్‌: కారు ఢీకొనడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మట్లివారిపల్లె పంచాయతీ గొడ్డిన్లవారిపల్లెకు చెందిన రైతు ఎస్‌.శ్రీరాములు (55) పురుగు మందులు కొనుగోలు చేసేందుకు బైక్‌పై గుర్రంకొండకు వెళ్లారు. మందులు కొనుగోలు చేసి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యంలోని కురబలకోట మండలం మంకు వారిపల్లె మలుపు వద్దకు రాగానే మదనపల్లె డిఈఓ కార్యాలయానికి విధులకు వస్తున్న సిబ్బంది కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ముదివేడు టోల్‌ ప్లాజా అంబులెన్స్‌కు సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement