రెచ్చిపోతున్న రౌడీమూకలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న రౌడీమూకలు

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

పీలేరులో బెంబేలెత్తుతున్న ప్రజలు

నిత్యం దాడులు జరుగుతున్న వైనం

కనిపించని లా అండ్‌ ఆర్డర్‌

యువకులపై కర్రలతో దాడి చేస్తున్న దృశ్యం

టీడీపీ నాయకుడు కత్తితో ప్రదర్శన

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పీలేరు పట్టణంలో రోజురోజుకు రౌడీమూకలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో మద్యం తాగిన యువకులు ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని తీవ్రంగా గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు పూర్తిగా విఫలం కావడంతో రౌడీమూకల అల్లర్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారం క్రితం కొత్తపల్లె రోడ్డులో కొంత మంది యువకులు మరో ముగ్గురి యువకులపై కర్రలతో విచక్షణా రహితంగా కొట్టి గాయపరచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బాధితులు పీలేరు, తిరుపతి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా సాయిగుడి వీధిలో రెండు నెలల క్రితం పట్టపగలు ముగ్గురిపై దాడి చేసి కాళ్లు విరగగొట్టి, తలలు పగలు గొట్టిన సంఘటన తెలిసిన విషయమే.

టీడీపీ నాయకుడి బర్త్‌డేకి హంగామా

పీలేరు పట్టణం నాలుగు రోడ్ల కూడలిలో వారం క్రితం ఓ టీడీపీ నాయకుడి బర్త్‌డేకి ఆయన అనుచరులు పెద్ద హంగామా సృష్టించారు. నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చుతూ సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించారు. ట్రాఫిక్‌కు పూర్తిగా అంతరాయం కల్గించారు. బహిరంగంగా కత్తి చూపిస్తూ హల్‌చల్‌ చేశారు. అదే రోజు ఓ వైపు పీలేరు ఎమ్మెల్యే కార్యక్రమం జరుగుతుండగా, మరోవైపు టీడీపీ కార్యకర్తలు హంగామా చేస్తుండడంతో ప్రజలు విస్తుపోయారు. పీలేరులో పోలీస్‌ వ్యవస్థ ఉందా, లేదా ? అని చర్చించుకోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement