రామసముద్రం : రామసముద్రం మండలం మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి మల్బరీ తోటపై పురుగులు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. రాత్రి పేడ పురుగుల్లాంటి రెక్క పురుగులు తోటపై దాడి చేయడంతో గమనించి రైతులు టార్చిలైట్లు వేసుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆకులను మొత్తంగా కొరికి తినేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటను రాత్రికి రాత్రే పురుగులు పడి పూర్తిగా నాశనం చేయడంతో పట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టు పురుగులకు వేయాల్సిన ఆకులపై ఆకస్మాత్తుగా పురుగులు దాడి చేయడంతో ఆకులు పూర్తిగా కత్తిరించాయని, దీంతో పట్టు పురుగుల పెంపకానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పట్టుపరిశ్రమ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే ఆదుకుని పురుగుమందులు, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
లబోదిబోమంటున్న రైతులు


