వాస్తవ వివరాలతో వినతులివ్వాలి | - | Sakshi
Sakshi News home page

వాస్తవ వివరాలతో వినతులివ్వాలి

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేస్తున్న తమకు వాస్తవాలతో కూడిన వినతులనే అందజేయాలని డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ప్రజలు, కుల సంఘాలకు సూచించారు. సోమవారం కడప కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ హాలులో ఆయన ప్రజలు, వివిధ సంఘాలు, పార్టీల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నెం.3 ద్వారా, సుప్రీం కోర్టు వివిధ తీర్పుల మేరకు ట్రిపుల్‌ టెస్ట్‌ నిబంధనలు అమలు చేసేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు రాజ్యాంగ బద్దంగా, శాసీ్త్రయంగా అధ్యయనం చేయడం కమిషన్‌ ప్రధాన ఉద్దేశమన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి వాటి ప్రభావాన్ని అంచనా వేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు తాము సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడారు. బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.మల్లికార్జున, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి వెంకట సుబ్బయ్య, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ హజరతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్‌.కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

కులగణన నిర్వహించాకే రిజర్వేషన్లు పెంచాలి

రాష్ట్రంలో కుల గణన నిర్వహించిన తర్వాతనే బీసీల జనాభా నిష్పత్తి ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు లేట్లపల్లి శివరాం కోరారు. సోమవారం బీసీ డెడికేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రాకు వినతిపత్రమిచ్చారు. బీసీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లు 2011 జనాభా ఆధారంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం 2021 సంవత్సరం ఆధారంగా రాష్ట్రంలో జనగణన జరుగుతోందన్నారు. అందులో కుల గణన నిర్వహించాక స్పష్టమైన, శాసీ్త్రయ బద్దమైన బీసీల జనాభా శాతం తేలుతుందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించే విధంగా ప్రభుత్వానికి సమర్పించే నివేదికల్లో పొందుపరచాలన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటిస్తే న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉంటుందన్నారు.

● బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి కులాల వారీగా వర్గీకరణ చేయాలని దూదేకుల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకేసుల బాదుల్లా, డీజీ అక్బర్‌ అలీలు కోరారు.

● రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున కోరారు.

● రాష్ట్ర వెనుకబడిన తరగతుల జాబితా గ్రూప్‌–ఇలో ఉన్న ముస్లిం వర్గాలను కేంద్ర జాబితాలో చేర్చడం ద్వారా ఓబీసీలుగా ప్రకటించాలని ఏఐసీసీ కో ఆర్డినేటర్‌ ఎస్‌ఏ సత్తార్‌ కోరారు. 2007 జులై 7న అప్పటి సీఎం వైఎస్సార్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడిన 15 వర్గాలకు చెందిన ముస్లింలను బీసీ–ఈ గ్రూపుగా చేర్చారని పేర్కొన్నారు.

డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌

రాజీవ్‌ రంజన్‌ మిశ్రా

Advertisement
 
Advertisement
Advertisement