హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లపై విచారణ | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లపై విచారణ

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

ఈనెల 21న కడపలో ఉద్యోగులతో

విచారణ జరిపిన సీఈ

సాక్షి, మదనపల్లె : హంద్రీ–నీవా ప్రాజెక్టు మదనపల్లె సర్కిల్‌–3లో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహరాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు ఏడున హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడం, చర్యలు తీసుకోవాల్సిన సర్కిల్‌ అధికారులు జాప్యం చేయడంతో ప్రభుత్వ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యాక అక్రమ పదోన్నతులపై ఎస్‌ఈ నుంచి ఈఎన్‌సీకి నివేదికలు వెళ్లాయి. అప్పటినుంచి ఈ వ్యవహరంపై విచారణ, చర్యలు పెండింగ్‌ పడుతూ వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి వాస్తవ నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం రాయలసీమ రీజియన్‌ క్వాలిటీకంట్రోల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ను విచారణాధికారిగా నియమించింది. దాంతో ఆయన విచారణ మొదలుపెట్టారు.

కడపలో విచారణ

మదనపల్లె సర్కిల్‌ పరిధిలో అక్రమ ప్రమోషన్లు పొందిన వారికి విచారణ అధికారి నోటీసులను జారీ చేశారు. ఈనెల 14న జారీచేసిన నోటిసుల్లో ఈనెల 21న కడప సీఈ కార్యాలయంలో విచారణకు హజరుకావాలని పేర్కొన్నారు. ఆ మేరకు విచారణ నిర్వహించారు. అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు పొందిన వారినుంచి ఉద్యోగ నియామకానికి సంబంధించిన రికార్డులు, నియామకం, పదోన్నతికి సంబందిత ఉత్తర్వులు, విద్యార్హత ధృవీకరణ పత్రాలను పరిశీలించడంతోపాటు వీరికి పదోన్నతులు కల్పించిన ఎస్‌ఈ ఏవరు, దీనికి సంబంధించి అనుకూలమైన నివేదికలు ఎవరిచ్చారు, ప్రభుత్వ స్థాయిలో అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా పదోన్నతులు కల్పించారు అన్న అంశాలపై విచారణ జరిపినట్టు తెలిసింది.

ఇదీ జరిగింది

మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో డిప్లొమా (ఈసీఈ)విద్యతో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగికి 2013 మార్చిన ఏడున టెక్నికల్‌ అసిస్టెంట్‌ నుంచి జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పదోన్నతి ఇవ్వడమేకాక 2022 జూలై ఒకటిన టెక్నికల్‌ ఆఫీసర్‌గా మరోసారి ప్రమోషన్‌ ఇచ్చారు. ప్రమోషన్‌ పొందేందుకు కావాల్సిన విద్యార్హతకు దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరడంతో ఈ అక్రమ పదోన్నతులు వెలుగుచూశాయి. అలాగే సర్కిల్‌లోని కుప్పం డివిజన్‌లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్‌ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్‌లో పని చేస్తున్న పి.ఖాదర్‌బాషాల విద్యార్ఘతలను పట్టించుకోకుండా పదొన్నతులు కల్పించారు. ప్రయోషన్‌ పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్‌ టెస్ట్‌ (డ్రాఫ్ట్స్‌’ మ్యాన్‌) సివిల్‌ లేదా మెకానికల్‌ కోర్సులో అర్హత సాధించాలి. దీన్ని పక్కనపెట్టి ముగ్గురికి టెక్నికల్‌ అిిసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. వీటిని గుర్తించిన ఈఎన్‌సీ మదనపల్లె ఎస్‌ఈకి మెమో జారీ చేశారు.

మరిన్ని అక్రమ ప్రమోషన్లు

మదనపల్లె సర్కిల్‌లో ఎస్‌ఈగా అదనపు బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఎస్‌ఈ హయాంలో మరికొన్ని అక్రమ ప్రమోషన్లు జరిగినట్టు వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్లక్రితం పనిచేసిన ఓ ఎస్‌ఈకి కొన్ని ప్రమోషన్లకు ఆమోదం ఇవ్వాలని ఓ ఉద్యోగి నివేదికలను సిద్దంచేసి ఒత్తిడి చేశారు. నివేదికను పరిశీలించిన ఆ ఎస్‌ఈ ఇందులో తిరకాసు ఉందని గుర్తించి ఆయన ఈ ఫైల్‌ను అక్కడితో నిలిపివేశారు. ఒత్తిడి పెరగడంతో అసలు ప్రమోషన్లు ఇవ్వొచ్చో లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆ ఎస్‌ఈ ప్రభుత్వ అభిప్రాయం కోరడంతో ఈ వ్యవహరం అంతటితో ఆగిపోయింది. అయితే ఆయన బదిలీ కావడంతో ఆ ఉద్యోగి తిరిగి చక్రం తిప్పారు. ఎస్‌ఈగా అదనపు బాధ్యతలను చేపట్టిన కొత్త ఎస్‌ఈ సంబంధిత ఉద్యోగి ప్రతిపాదించిన అక్రమ ప్రమోషన్లకు వెనకాముందు ఆలోచించకుండా ఆమోదం తెలిపిన విషయం ఇప్పడు చర్చనీయాంశమైంది. దీంతో వెలుగులోకి రాని ఈ అక్రమ ప్రమోషన్లపైనా విచారణ జరుగుతోందా లేదా అనేది తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement