మదనపల్లె సిటీ : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోర్టులో గంగమ్మను భక్తులు కొలుస్తున్నారు. మదనపల్లె పట్టణం కోర్టు ఆవరణంలో వెలసిన గంగమ్మ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మంగళవారం రాత్రి తిరునాలతో జాతర ప్రారంభమవుతుంది. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. దీంతోపాటు పటేల్‌రోడ్డు, బెంగుళూరు రోడ్డు, సొసైటీ కాలనీ, రాటకొండ వీధి, అమినేనివీధి, మల్లికార్జున సర్కిల్, కదిరిరోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రదాన కూడళ్లులో అమ్మవారు, వివిధ దేవతా మూర్తుల విద్యుత్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.
ఆలయ చరిత్ర
కోర్టు ఆవరణంలో వెలసిన గంగమ్మ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. సుమారు 300 ఏళ్ల కాలంలో నాడు కర్ణాటకలోని బాగేపల్లె ప్రాంతంలో పుట్టిన అమ్మవారిని జోళెపాలెం వంశస్థులు మదనపల్లెకు తీసుకువచ్చారు. స్థానికులకు అనారోగ్యం చేసినప్పుడు అమ్మవారిని వేడుకుని ఆరోగ్యం కుదట పడాలని వేడుకున్నారు. అమ్మవారి దయతో అందరూ ఆరోగ్యంగా ఉండటంతో అప్పటి నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆవరణంలో మార్పురి వంశస్థులు అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.
కల్లుకుండలకు పూజలు
కోర్టులో వెలసిన గంగమ్మ జాతరకు ప్రత్యేకంగా ఉంది. తొలి రోజు శాస్త్రివీఽధిలోని రాటకొండ వంశస్తులైన రాటకొండ బాబురెడ్డి నివాసం ఉంచి కల్లుకుండలు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి వద్ద ఉంచి పూజలు చేస్తారు. కృష్ణానగర్‌లోని కుమ్మరి శ్రీరాములు వంశస్తులు తయారు చేసిన అమ్మవారి ప్రత్యేక విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. బుధవారం ఉదయం తిరునాల వైభవంగా జరుగుతుంది. జాతరకు మదనపల్లె పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
నేడు రాత్రి తిరునాల


