మదనపల్లె టౌన్ : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. సోమవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి, వారి సమస్యలు ఆలకించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యమిచ్చి, సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాంక్రీట్ మిల్లర్ బోల్తా :
కార్మికుడికి తీవ్రగాయాలు
ఠిమదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో కాంక్రీట్ మిల్లర్ యంత్రం బోల్తాపడటంతో కార్మికుడి చేయి పూర్తిగా తెగిపోయింది. పోలీసుల కథనం మేరకు గొల్లపల్లికి చెందిన రమేష్ కుమారుడు పవన్ కల్యాణ్ (24) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నారు. సోమవారం పట్టణంలోని ఎంఎల్‌ఎల్ ఆసుపత్రి సమీపంలో ఓ ఇంటి పునాది పనులు చేస్తుండగా కాంక్రీట్ మిల్లర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ యంత్రంలో చిక్కుకుపోవడంతో ఆయన చేయి పూర్తిగా తెగిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు, స్థానికులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ స్థలాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీసులు సూచించారు.
గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా
చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రక్షక్ వాహన సిబ్బంది నరసింహులు బాధితుడిని వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక అధికారులు, ఐఓసిఎల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీకేదిన్నె మండల సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఘటనా స్థలంలోనే ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని ఉంచి మంగళవారం గ్యాస్ ట్యాంకర్‌ను యథాస్థితికి తీసుకొస్తామని తెలిపారు.


