మదనపల్లె టౌన్ : ప్రత్యర్థులు తమ భూములు ఆక్రమించుకుని చంపేందుకు కుట్ర పన్నారని కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఎరజేనువారిపల్లెకు చెందిన రెడ్డమ్మ ఆరోపించారు. సోమవారం మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అమర్నాథరెడ్డికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారని వాపోయారు. భూ సర్వే చేయించేందుకు అధికారులను తీసుకెళ్తే సర్వే చేయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రత్యర్థులైన బాలక్రిష్ణారెడ్డి, మంజునాథరెడ్డి, బయ్యారెడ్డి, సుధాకర్‌రెడ్డి, చిన్ని తదితరులు తనను హతమార్చాలని దారి కాస్తున్నారని ఆరోపించారు. తన భూములను సర్వే చేయించి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కట్నం కోసం వేధింపులపై..
మదనపల్లె టౌన్ : కట్నం కోసం గర్భిణిని అని కూడా కనికరం లేకుండా తనను అత్తింటి వారు గెంటేశారని రామసముద్రం మండలం, గజ్జి గంగన్నపల్లెకు చెందిన ఎస్.సుబ్రహ్మణ్యం భార్య మౌనిక ఆరోపించారు. మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజిఆర్‌ఎస్‌లో ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను 9 నెలల గర్భంతో ఉండగా ఓ యువతి మాయలోపడి ఆమె చెప్పినట్లు వింటూ తనను అదనపు కట్నం కోసం అత్తింటి నుంచి గెంటేశారని ఆరోపించారు. ఈ విషయమై రామసముద్రం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయకుండా కానిస్టేబుల్ శాంతమ్మ తనను విచారించకుండానే తెల్ల కాగితంలో సంతకం చేయించుకుని, కేసు రాజీ కుదిర్చామని చెప్పారని విలపించారు. రామసముద్రం పోలీస్‌స్టేషన్లో కేసు కట్టకుండా పుంగనూరుకి చెందిన సల్మా హ్యూమన్ రైట్స్ అని చెప్పుకొంటూ తనకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబీకులతో కలసి తన వద్ద ఉన్న సుమారు రూ. 3 కోట్ల ఆస్తిని ఇప్పటికే కాజేశారని, తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.


