సాక్షి, మదనపల్లె: దశాబ్దకాలం నుంచి మదనపల్లెలోనే తిష్ట వేసిన హంద్రీనీవా డివిజన్–12 అధికార యంత్రాంగం ఇక్కడనుంచి కుప్పానికి కదిలేలా ఏప్రిల్ 16న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మదనపల్లె నుంచి కుప్పానికి తరలి వెళ్లాల్సిన కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులు వెళ్తారా, వెళ్లరా అన్నది భేతాళుడి ప్రశ్నలా మారింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పలు ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించాల్సిన అధికారులు అప్పట్లో తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం నుంచే ఆదేశాలను అందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.వివరాల్లోకి వెళితే.
● హంద్రీనీవా రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి 1991 నుంచి మదనపల్లెలో సర్కిల్ నెంబర్–3 ఎస్‌ఈ కార్యాలయం కొనసాగుతోంది. దీని పరిధిలోనే ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొంత భాగం దీని పరిధిలోకి వస్తుంది. ఇందులోనే మదనపల్లె డివిజన్–12 కార్యాలయం కుప్పం ఉపకాలువల నిర్వహణకు సంబంధించింది. దీన్ని కుప్పానికి తరలించాలని 2015 మార్చి 26న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తరువు జారీ చేసింది. దీని అనుసరించి కుప్పంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం, పలమనేరు, వి కోటలో ఒకటి రెండు సబ్ డివిజన్ కార్యాలయాలు, కుప్పంలో మూడు, నాలుగు సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే అధికార యంత్రాంగం విధులు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటిదాకా మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయం నుంచే ఈ అధికార యంత్రాంగం అంతా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.
కార్యాలయం ఓ చోట.. విధులు మరోచోట!
మదనపల్లె డివిజన్–12 పరిధిలో కుప్పం, కుప్పం ఉపకాలువ పనులు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన రెండు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, కాలువల్లో నీటి నిర్వహణ, మళ్లింపు తదితర పనులు పర్యవేక్షించాలంటే కుప్పం నుంచే విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులు మదనపల్లె దాటి వెళ్లడానికి సుముఖత చూపించడం లేదు. ప్రతీసారి ఏదో ఒక సాకు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. కుప్పంలో ప్రభుత్వ భవనాలు లేవని, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేవని, అందువల్ల మదనపల్లెలోని కార్యాలయాలు కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని విన్నవించారు. అంతేనా కాలువ పనులు పూర్తి కావడంతో ఇక్కడ కార్యాలయాల నిర్వహణ ఆర్థిక భారమని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి తిరుపతి, అనంతపురం సీఈలకు ఈ విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై ఇద్దరు సీఈలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
కుప్పం ఈఈ కార్యాలయంపై తరలలేదని
సాక్షిలో ప్రచురితమైన కథనాలు
మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయం కిందే కొనసాగుతున్న కుప్పం ఈఈ కార్యాలయం
మదనపల్లెను వీడని హంద్రీనీవా అధికారులు
చంద్రబాబు నియోజకవర్గమైనాప్రభుత్వ ఆదేశాల ధిక్కారం
మదనపల్లె డివిజన్–12 కుప్పంలోనే ఉండాలని తాజా ఉత్తర్వు
మదనపల్లె డివిజన్–12 కార్యాలయం, సబ్ డివిజన్లో కుప్పం నియోజకవర్గంలో కొనసాగాల్సిందేనంటూ జల వరుణుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (పాలన) ఎంఎల్‌ఎన్. వరప్రసాద్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక రూపంలో ఇచ్చారు. ఈ మేరకు కుప్పంలో ఈఈ కార్యాలయం, ఇతర చోట్ల సబ్ డివిజన్లు కొనసాగడం, అక్కడి నుంచే విధులు నిర్వహించాలని ఉత్తర్వు జారీ చేశారు. అంటే ప్రస్తుతం మదనపల్లెలోని డివిజన్–12 కుప్పంలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి విధులు నిర్వహించాలన్న విషయాన్ని ప్రభుత్వం పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇవి మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయానికి ఏప్రిల్ 24న అందాయి. ఇంతవరకు ప్రాజెక్టు అధికార యంత్రాంగంలో కనీస చలనడం లేదు.


