సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురాలాలని డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు 94408 17449 నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సాక్షి, మదనపల్లె: స్థానిక కలెక్టరేట్‌లో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదుల సేకరణ జరుగుతుందన్నారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. మల్లమ్మ విగ్రహానికి వెండి ఆభరణాలు, నాగపడిగ, కవచం ధరింపజేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి జరిగిన వేడుకలో వల్లభ ఉత్సవ విగ్రహాన్ని అశ్వ వాహనంపై కొలువుదీర్చి హార్సిలీకొండ రహదారులపై ఊరేగించారు. భక్తులు తరలివచ్చి మల్లమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలిరావడం విశేషం.
మదనపల్లె సిటీ: ఫుట్‌బాల్ జిల్లా జూనియర్స్,సబ్ జూనియర్స్ బాలుర జట్ల ఎంపిక స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు వందకుపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 30 మందిని ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కార్యదర్శి కె.మురళీధర్ తెలిపారు. వీరికి 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. వారి ప్రతిభ,ఫిట్‌నెస్,ఆటతీరును పరిశీలించి తుది జట్టుకు 20 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దిలీప్‌కుమార్, ఎంఈఓ అంజనేయులు, ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేంద్ర, అసోషియేషన్ ఉపాధ్యక్షుడు చంద్రకళ, జాన్ కమలేష్, బాలాజీ పాల్గొన్నారు.


