ఏడు రాష్ట్రాలకు ఎగుమతి
సాక్షి, మదనపల్లె: మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాట ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈనెల ప్రారంభం నుంచి మెల్లగా పెరుగుతూ వచ్చిన తర్వాత ఈనెల 20న కిలో రూ.34కు చేరింది. తర్వాత మళ్లీ తగ్గుముఖం పట్టిన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. కిలో అత్యధిక ధర రూ.30 పలకగా, రెండో గ్రేడ్ లో అతి తక్కువ ధర కిలో రూ.16 పలికింది. అయితే ప్రస్తుత ధరలు ఆశాజనకంగా ఉండడం రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ఎప్పుడూ ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఈ పరిస్థితి కొంత ఊరట లభించింది.
ఇలా పలుకుతున్న ధరలు
మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు గత 15 రోజులుగా ఇలా ఉంటున్నాయి. అత్యధిక ధర వివరాలు పరిశీలిస్తే..ఈనెల 10న కిలో రూ.23, 11న రూ.24, 12న రూ.26, 13న రూ.28, 14న రూ.29, 15న రూ.30, 16న రూ35, 17న రూ33, 18న రూ.34, 19న రూ.32, 20న రూ.34, 21న రూ.31, 22న రూ.28, 23న రూ.29, 24న రూ.30 పలికింది.
విక్రయానికి 7,643 టన్నులు
ఈనెల 10 నుంచి ఆదివారం వరకు మదనపల్లె మార్కెట్ కు 7,643 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు టమాటను ఇక్కడికి తరలించి విక్రయించుకుంటారు. ఈ 15 రోజుల్లో ఈ నెల 18 నుంచి టమాట దిగుబడి భారీగా పెరిగింది. 18న 502 టన్నులు, 19న 598 టన్నులు, 20న 580 టన్నులు, 21న 587 టన్నులు, 22న 650 టన్నులు, 23న 671 టన్నులు రాగా ఇప్పటిదాకా అత్యధికంగా ఆదివారం 698 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది.
మదనపల్లె మార్కెట్ నుంచి ఆదివారం 7 రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయింది. ఒడిస్సా, పశ్చిమబంగా, తెలంగాణ చత్తీస్గడ్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళం లతోపాటు ఏపీలోనే విజయవాడ, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, అనకాపల్లిలకు ఎగుమతి అయ్యాయి.
మళ్లీ కిలో రూ.30


