బి.కోడూరు : మండలంలోని పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఎంపీపీ పాఠశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బద్వేలు పట్టణంలోని చాపలవీధికి చెందిన శెశెట్టిసుభాష్ (21) అక్కడికక్కడే మృతిచెందాడు.వివరాల్లోకి వెళితే చాపలవీధికి చెందిన శెశెట్టిసుధాకర్, అనురాధలకు ఇద్దరు కుమారులు. కుటుంబ సభ్యులతో కలిసి పోరుమామిళ్లలోని ఎల్లమ్మ జాతరకు వెళ్లార. జాతర ముగిశాక కుటుంబసభ్యులు కారులో, ఇద్దరు అన్నదమ్ములు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. పోరుమామిళ్ల నుంచి బద్వేలు వస్తున్న ఆర్టీసీ బస్సు రామచంద్రాపురం సమీపంలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద బ్రేకు వేయడంతో వెనుక వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్న సుభాష్, శివసాయిరామ్ బస్సును ఢీకొట్టారు. దీంతో సుభాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. శివసాయిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లారు. సుభాష్ అన్నమాచార్య కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శివసాయిరామ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బి.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.
లారీ, ద్విచక్రవాహనం ఢీకొని..
మైదుకూరు : మైదుకూరు శివారులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుపాకుల బ్రహ్మక్క (45) అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త రత్నం, కుమార్తె మేరీ గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం శ్రీరాములపేట పరమేశ్వర నగర్‌కు చెందిన రత్నమ్మ భార్య కుమార్తెతో కలిసి దువ్వూరు మండలం గుడిపాడు వద్ద ఉన్న చర్చికి ప్రార్థనల కోసం వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వారు తిరిగి వస్తుండగా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. సంఘటనలో రత్నం భార్య బ్రహ్మక్క అక్కడికక్కడే మృతి చెందింది. రత్నం, కుమార్తె మేరీకి గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు.రత్నం పక్కటెముకల వద్ద గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బ్రహ్మక్క మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం


