రాజుపాళెం : నూతనంగా నిర్మించుకున్న రేకుల షెడ్డులో కొంతమంది గుర్తు తెలియని దొంగలు జీవాలను ఎత్తుకెళ్లిన సంఘటన రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వెంగళాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కంపమల్ల దావీదు అలియాస్ రవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జీవాల పెంపకం తోడ్పాటు నిస్తుందని భావించి అప్పు చేసి కాలనీ సమీపంలో గాదెగూడూరు గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. అందులో జీవాలతో పాటు కోళ్లను పెంచుకుంటున్నాడు. ఈక్రమంలో 15 పొట్టేళ్లు, ఒక గొర్రె, ఒక మేక, ఒక మేకపోతును శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చుట్టు ఉన్న కంచెను కత్తిరించి షెడ్డుకు ఉన్న వాకిలి తీసి ఎత్తు కెళ్లారు. రాత్రి రవి అక్కడే నిద్రించాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జీవాలు లేవని రవి గుర్తించాడు. అప్పటి నుంచి ఈ సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన తీరును బాధితుడు రవిని అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించేందుకు ఎస్‌ఐ చర్యలు చేపట్టారు. దొంగలు ఎత్తుకెళ్లిన జీవాల విలువ దాదాపు రూ.2,90,000 ఉంటుందని, అలాగే రూ.9 వేలు విలువ చేసే సెల్ ఫోన్ కూడా దొంగలించినట్లు బాధితుడు రవి వాపోయాడు.
గాయపడిన జింక
జమ్మలమడుగు : పెద్దముడియం మండలం కల్వటాల గ్రామ సమీపంలో ఉన్న సోలార్ ప్యానల్స్‌లో దూరి జింకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ మాధవ మునిరెడ్డి తన సిబ్బందితో కలిసి దానిని రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఫారెస్టు అధికారులు గాయాలైన జింకకు పశుసంవర్థకశాఖ వైద్యులతో వైద్యం చేయించారు. అనంతరం అడవిలో వదిలేశారు.


