రాయచోటి : అగ్గిపెట్టె విషయమై మద్యం మత్తులో నెలకొన్న ఘర్షణ కత్తులతో దాడి చేసుకునే వరకు దారి తీసింది. ఈ దాడిలో కొత్తపల్లి రెడ్డిసాయి(20) తోటి మిత్రుల చేతిలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.... పాత రాయచోటికి చెందిన రెడ్డిసాయి, ఆర్ కె శివ, పుల్లయ్యలు సమీప నివాస ప్రాంతాల్లో నే శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు మద్యం తాగుతూ కాలాన్ని వెల్లదీసినట్లు పోలీసులు తెలిపారు. రెండున్నర గంటల సమయంలో సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె తేవాలని ఆర్ కె శివ, పుల్లయ్యలు రెడ్డి సాయికి చెప్పారు. ఈ సమయంలో తాను అగ్గిపెట్టెను తేలేనని చెప్పడంతో ముగ్గురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురి మధ్య మాట మాటా పెరిగడంతో ఆర్.కె.శివ, పుల్లయ్యలు కత్తులతో రెడ్డి సాయి ఛాతి, కడుపుపై పొడిచినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న రెడ్డి సాయిని చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


