గుర్రంకొండ : భానుడి వేడిమి ప్రభావం టమాటా నారుమొక్కలపై పడడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో 60 పైసలు ఉన్న ధర ప్రస్తుతం రూ.1.60 వరకు పెరిగాయి. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు టమాటా పంట సాగువైపు దృష్టి సారించారు. అయితే అఽందుకు తగ్గట్టుగా నారు మొక్కలు లభించకపోవడంతో నర్సరీల్లో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఓవైపు కొత్తగా సాగు చేయడానికి నారు మొక్కలు దొరక్క.. మరోవైపు కష్టపడి నాటిన మొక్కలు ఎండల తీవ్రంగా చనిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్థానిక నర్సరీల్లో వీటికి డిమాండ్ ఉండడంతో కర్ణాటక, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల నుంచి నారు మొక్కలను దిగుమతి చేసుకొంటున్నారు. గత నెలవరకు మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు ఈ పంట సాగు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 780 నుంచి రూ. 800వరకు, 15కేజీల చిన్న క్రీట్ ధర రూ. 380 నుంచి రూ. 420 వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 5280 ఎకరాల్లో టమాటా పంట సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎకరా పంటసాగు చేయడానికి 7 వేల నారుమొక్కలు అవసరమవుతాయి. ఎండల ధాటికి కనీసం వందకు 20 నుంచి 30 నారు మొక్కలు చనిపోతున్నాయి. దీంతో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు రైతులు నర్సరీల వైపు పరుగులు తీస్తున్నారు. ఎండల ప్రభావంతో నర్సరీల్లో పెంచుతున్న టమాటా నారుమొక్కలు సరిగా పెరగడంలేదు. ఎదుగుదల దీంతో వీటికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
కర్ణాటక నుంచి నారుమొక్కల దిగుమతి
ఎన్నడూ లేని విధంగా జిల్లా రైతులు కర్ణాటక రాష్ట్రం నుంచి టమాటా నారును దిగుమతి చేసుకొంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వీటికి డిమాండ్ లేదు. మార్కెట్లో టమాటా ధరలు పడిపోవడంతో రైతులు ఆ రెండునెలల్లో పంటసాగు చేపట్టడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో జిల్లాలోని నర్సరీల్లో టమాటా నారు మొక్కలు పుష్కలంగా అందుబాటులో ఉండేవి.కానీ కొనేవారు లేక వదిలేశారు. చాలా నర్సరీల్లో చనిపోయిన, ముదిరిపోయిన నారుమొక్కలను కుప్పలు తెప్పలుగా బయట పారబోశారు. గత పదిహేను రోజులుగా ధరలు పుంజుకోవడంతో రైతులు నారు మొక్కల కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం స్టాకు లేకపోవడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం, కోలార్, చింతామణితోపాటు రాష్ట్రంలోని అనంతపురం, పుట్టపర్తి జిల్లాలోని నర్సరీల నుంచి టమాటా నారుమొక్కలు దిగుమతి చేసుకొని పంటలు సాగుచేసుకొంటున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో టమాటా నారుమొక్కల ధరలు గతంతో పోల్చుకొంటే మూడు రెట్లు అధికంగా పెరిగాయి. మార్చి, ఏప్రిల్‌నెలల్లో ఒక నారుమొక్క రూ. 60 పైసలు లోపే లభించేవి. ఎండల ప్రభావం, నారుమొక్కలకు ఉన్న డిమాండ్ తో ప్రస్తుతం రూ. 1 నుంచి రూ. 1.60వరకు ధర పెరిగింది. నర్సరీ యజమానులు ఇష్టానుసారం ధరలు పెంచేయడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది.
టమాటా నారుపై భానుడి ప్రతాపం
రూ.60పైసల నుంచి రూ.1.60కి
పెరిగిన ధరలు
నర్సరీల్లో మొక్కలకు డిమాండ్
జిల్లాలో 5280 ఎకరాల్లో
పంటసాగుకు సన్నద్ధం
నారుమొక్కలకు డిమాండ్ ఉంది
గత రెండునెలలతో పోల్చుకొంటే ఈనెలలో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పంట సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల టమాటా నారుమొక్కలకు డిమాండ్ ఏర్పడింది.అయితే ఇక్కడి నర్సరీల్లో అశించినంత మేరకు నారుమొక్కలు దొరకడంలేదు. దీంతో బయటి ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది.
– వెంకటరమణ, చారావాండ్లపల్లె
ఎండ వేడిమికి చనిపోతున్నాయి
ప్రస్తుతం ఎండ వేడిమికి కొత్తగా పంటసాగు చేస్తున్న పొలాల్లో నారుమొక్కలు చనిపోతున్నాయి.ఎండల ప్రభావం టమాటా పంటపై ప్రభావం చూపిస్తోంది. నారుమొక్కలు నాటిన నెలరోజుల వరకు మొక్కలను కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. సాయంత్రం పూట నారుమొక్కలపై నీటిని స్ప్రే చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఎండల ప్రభావంతో వందకు 20 నుంచి 30 మొక్కలు చనిపోతున్నాయి,
– సుధాకర్, గంగిరెడ్డిపల్లె


