రాయచోటి : తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దశరధరామిరెడ్డిపై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడిపై దాడి జరగడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాజకీయ కక్ష్యలతో హింసకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఘటన అని పేర్కొన్నారు. ప్రజా సేవకుడిపై కత్తులు, దాడులు సంస్కృతి సరికాదని, ఇది పూర్తిగా అరాచకానికి నిదర్శనమని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఎవరైనా ఎంత పెద్దవారైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి పూరుఇ్త భద్రత కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకొని దుండగులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. దశరథరామిరెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉంటుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
దశరధరామిరెడ్డిపై దాడి దారుణం


