సాక్షి, మదనపల్లె : మదనపలె్‌ల్ పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని అనిబిసెంట్ కూడలి నుంచి బెంగళూరు రోడ్డు బస్ స్టాండ్ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి కలెక్టర్, జేసీ శివ్‌నారాయణ్ శర్మ, కమిషనర్ ప్రమీల స్వయంగా చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో వచ్చే నాలుగు వారాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు. విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, మున్సిపల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, ప్రజలందరి భాగస్వామ్యంతో పరిశుభ్రమైన పట్టణంగా మదనపల్లెను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్న షాపులు, హోటళ్లు, గృహ యజమానులకు అవగాహన కల్పిస్తామని, మార్పు రాకపోతే జరిమానాలు విధింపు, షాపుల సీజ్ చేస్తామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మొదటి వారంలో ప్రజలకు అవగాహన కల్పించడం, పరిశుభ్రత పాటించేలా ప్రోత్సహించడం, నిబంధనలు ఉల్లంఘించే షాపులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్


