పుంగనూరు: రెండేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం శ్రీబోయకొండ పాలకవర్గ చైర్మన్ పదవికి మాత్రం ఎవరినీ నియమింలేదు. దీంతో తమ్ముళ్ళు తీవ్ర నిరాశ ,నిసృహలకు లోనవుతున్నారు. పాలన గాడితప్పతోంది. ఉమ్మడి జిల్లాల్లో రెండోస్థానంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఏటా రూ.15 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది. రెండేళ్లవుతున్నా చైర్మన్ నియామకం త్రిశంఖు స్వర్గంలో పడటంతో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తూ..ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. వీరితో పాటు కాంట్రాక్టర్లు భక్తులపై దాడులు సైతం చేస్తుండటంతో భక్తజనం భయాందోళనలకు లోనవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా చౌడేపల్లె మండలం బోయకొండ ఆలయం వెలుగొందుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డిల కృషితో సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేసి ఆలయాన్ని సుందరంగా మార్చి వేశారు. ఆలయ హోదాను డీసీ స్థాయికి పెంచి, ఎప్పటికప్పుడు పాలకవర్గాన్ని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వారు పలు అవినీతి అక్రమాలకు పాల్పడటం, భక్తులపై దాడులు, దౌర్జన్యాలు చేయడం వివాదస్పదమౌతోంది. నియంత్రించాల్సిన అధికారులు అధికార పార్టీకి చెందిన ఒక వర్గానికే మద్దతు ఇవ్వడంతో మరో రెండు గ్రూపులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం, బహిరంగంగా విమర్శించడం జరుగుతోంది.
కుర్చీకోసం....
శ్రీ బోయకొండ గంగమ్మ పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 7న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 27లోపు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ మేరకు 115 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగుదేశం తరపున ఎస్‌కె.రమణారెడ్డి, లక్ష్మీపతిరాజు, జనసేన తరపున చిన్నారాయల్ విడివిడిగా తమ గ్రూపు డైరెక్టర్లు 13 మందితో కలసి దరఖాస్తు చేసుకున్నారు. ఎస్‌కె.రమణారెడ్డి అధిష్టానంతో నేరుగా చైర్మన్ పదవి కోసం పైరవీ చేస్తున్నారు. మరో నాయకుడు లక్ష్మీపతిరాజు స్థానిక ఇన్‌చార్జితో కలసి మంతనాలు సాగిస్తున్నారు. జనసేన నాయకుడు చిన్నరాయల్ తన పార్టీ నేతలు, బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలతో ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైర్మన్ నియామకం రెండేళ్లుగా జరగకపోగా, నిర్ణయం నారావారి చేతుల్లో నలిగిపోతోంది.ఆలయానికి చైర్మన్‌ను నియమించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతోందని భక్తులు అంటున్నారు. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ నియామకం, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై లక్ష్మీపతిరాజు గురువారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును బెంగళూరు విమానాశ్రయంలో కలిశారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. కాగా దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
చౌడేపల్లె మండలంలోని బోయకొండ ఆలయం చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ
అక్రమాలు, దౌర్జన్యాలతో
విసిగిపోతున్న భక్తజనం
త్రిశంఖు స్వర్గంలో చైర్మన్ నియామకం
నారావారి చేతుల్లో నలుగుతున్న నిర్ణయం


