● ప్రత్యక్షంగా అంగీకరించిన
మార్కెట్ కార్యదర్శి
● నోటీసులతో మొదలైన చర్యలు
సాక్షి, మదనపల్లె: ములకలచెరువు మార్కెట్ యార్డులో టమాటా రైతుల నిలువు దోపిడీ కొనసాగుతోందన్న విషయం మార్కెట్ అధికారుల మాటల్లోనే తేటతెల్లమైంది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శ్రీసాక్షిశ్రీప్రచురిస్తున్న వరుస కథనాలు నిజాలేనని అధికారులు పరోక్షంగా అంగీకరించారు. గురువారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన హమేషా తమాషా చెయ్యరా కథనంపై మార్కెట్ కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి అత్యవసరంగా మండీ యజమానులతో సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ సమావేశంలో ఇకపై రైతులు విక్రయానికి తెచ్చిన టమాట క్రేట్లకు జాక్ పాట్ తీసుకోకూడదని, నెలాఖరులోగా 15 కిలోల క్రేట్లను విధిగా వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే అధికారుల సాక్షిగా ఏళ్ల తరబడి ములకచెరువు మార్కెట్లో జాక్ పాట్ తీస్తున్నారని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మాటలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని రైతులు అంటున్నారు. స్వయంగా మార్కెట్ కార్యదర్శి జాక్ పాట్ ఉండకూడదని సమావేశంలో స్పష్టంగా చెప్పారంటే ఇప్పటిదాకా ఈ దోపిడీ కొనసాగుతున్నట్టే కదా అని రైతులు చర్చించుకుంటున్నారు. తద్వారా రైతులు ఎన్ని రూ.కోట్ల ఆదాయాన్ని నష్టపోయి ఉంటారో అంచనా వేయొచ్చు. ఇలా ఉండగా 15 కిలోల క్రేట్ల విధానం అమలు చేసేందుకు ఇంతకాలం అధికారులు ఎందుకు వెనకడుగు వేశారన్న చర్చ కూడా రైతుల్లో జరుగుతోంది. 15 కిలోల క్రేట్లను అమలు చేయాలని ఆదేశించామని అదే విషయాన్ని కార్యదర్శి, ఏడీలు పదే పదే చెబుతూ వచ్చారు. ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ‘సాక్షి’కథనాలతో టమాట రైతులకు తాము ఏ విధంగా నష్టపోతున్నామో, మోసాలకు గురి అవుతున్నామో పూర్తిగా అర్థం చేసుకున్నారు. దాంతో రైతుల్లో 15 కేట్ల విధానం కావాలని, జాక్ పాట్ రద్దు చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో చివరకు మార్కెట్ కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మండీ యజమానులతో సమావేశం నిర్వహించడమే కాక గట్టి ఆదేశాలు ఇచ్చారు. నెలాఖరునుంచే 15 కిలోల క్రేట్లను అమలు చేయాలని, జూన్ 15 నాటికి పూర్తిస్థాయిలో అమలు కావాలని ఈ మేరకు ఆయన గురువారం రాత్రి మండీ యజమానులకు నోటీసులు జారీ చేశారు. అమలు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నట్టు కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం చెప్పారు.


