జనాభా ఎందుకు తగ్గింది | - | Sakshi
Sakshi News home page

జనాభా ఎందుకు తగ్గింది

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీలో జనాభా తగ్గుదల అనుమానంగా ఉంది.. జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటి.. ఇలా ఎందుకు జరుగుతుందంటూ కేంద్ర గృహ గణన బృందం స్థానిక అధికారులను ప్రశ్నించింది. శుక్రవారం కేంద్ర గణన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుప్రజ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ గోపాల్‌ అగర్వాల్‌, జిల్లా సెన్సెస్‌ అధికారి రెడ్డి విష్ణుప్రియ, డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి లక్ష్మిపతి బి.కొత్తకోటలో గృహ గణనపై తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని రెండు వార్డుల్లో స్వయంగా పర్యటించి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించాయి. తక్షణమే బృందం మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించారు. జనాభా లెక్కల వివరాలను పరిశీలించారు. 2021లో ఉన్న జనాభా కంటే 2026లో మూడు వేల జనాభా తగ్గడం గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్‌ రమాదేవిని బృందం ప్రశ్నించింది. ఇక్కడినుంచి వలసలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుందని వారికి వివరించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడ సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన గణన వివరాలు, పెండింగ్‌ అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెలాఖరులోగా గృహ గణకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఇంటిని నమోదు చేయాలని ఆదేశించారు. తాళాలు వేసి ఉన్నవారి ఫోన్‌ నంబర్ల ఆధారంగా వారిని సంప్రదించాలని సూచించారు. వారి వివరాలను నమోదు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న గృహాలకు సంబంధించిన వివరాలు కూడా మరోసారి పరిశీలించి నమోదు చేయాల్సిందేనని పేర్కొన్నారు.

ఖాళీ ఇళ్లు, తాళాలపై

కేంద్ర బృందం ఆశ్చర్యం

Advertisement
 
Advertisement
Advertisement