మదనపల్లె టౌన్: హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొంది గ్రామానికి చెందిన ఎరప్ప్ర నాయుడు కుమారుడు ఏ. శ్రీరాములు నాయుడు (35) శుక్రవారం తెల్లవారుజామున పాలెంకొండలో కూలీల కోసం వైపు హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సీటీఎం చెరువు సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శ్రీరాములు నాయుడును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.


