నేను ఇప్పుడే వచ్చాను
లక్ష్యాలు కాగితాలకే పరిమితం.. ఎండిపోతున్న మొక్కలు
● లక్ష్యానికి దూరంగా
సామాజిక అటవీకరణ
● జిల్లాలో నిధులు పుష్కలం, పనులు శూన్యం!
● 43 పోస్టులకు గాను 17 ఖాళీలు..
కుంటుపడిన పర్యవేక్షణ
● కాగితాలకే పరిమితమైన
12.5 లక్షల మొక్కల లక్ష్యం
● నిధుల దుర్వినియోగంపై
సీపీఐ, పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం
మదనపల్లె టౌన్: రహదారుల వెంబడి, బంజరు భూముల్లో పచ్చదనం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, అన్నమయ్య జిల్లాలో సామాజిక అటవీకరణ (సోషల్ ఫారెస్ట్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల కొరత, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపం, అవినీతి ఆరోపణల నడుమ ఈ ప్రాజెక్టు తన అసలు లక్ష్యానికి దూరమవుతోంది.
తీవ్ర సిబ్బంది కొరత..
ఒక్కొక్కరికి 3–4 పంచాయతీలు
జిల్లా సోషల్ ఫారెస్ట్ విభాగంలో మొత్తం 43 పోస్టులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 26 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టు ఒకటి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 7, నర్సరీ ఇన్‌చార్జ్‌లు 5 ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో బీట్ ఆఫీసర్ 3 నుంచి 4 పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ పూర్తిగా గాలికొదిలేశారు.
అక్రమాల జోరు.. చర్యలు శూన్యం!
ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్వించి, మొక్కలు నాటినట్లు కేవలం రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జియో–ట్యాగింగ్, సర్వైవల్ రిపోర్టుల అప్‌డేట్ నామమాత్రంగానే సాగుతోంది. నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు లేకపోయినా టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ నేతలు మండిపడుతున్నారు. మొక్కల మనుగడ రేటు 60% కన్నా తక్కువ ఉంటే సంబంధిత అధికారుల వేతనంలో కోత విధించాలనే నిబంధన ఉన్నా, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
నిధులు పుష్కలం.. ఖర్చు 53 శాతమే!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ. 4.80 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఇందులో గ్రీన్ ఇండియా మిషన్ (కేంద్ర వాటా) రూ. 2.10 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 1.70 కోట్లు, ఉపాధి హామీ కన్వర్జెన్స్ కింద రూ. 1.00 కోటి విడుదలయ్యాయి. అయితే, ఇప్పటివరకు అందులో కేవలం 53 శాతం మాత్రమే ఖర్చు చేశారు.
ప్రజలు, పర్యావరణ ప్రేమికుల డిమాండ్లు:
● ఖాళీగా ఉన్న 17 పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
● నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డ్, డ్రిప్ సదుపాయం కల్పించాలి.
● థర్డ్ పార్టీ ద్వారా ‘సర్వైవల్ ఆడిట్’ చేయించి, నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంబడి (అవెన్యూ ప్లాంటేషన్), బంజరు భూములు, చెరువు గట్లపై (బ్లాక్ ప్లాంటేషన్) మొత్తం 12.5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పటివరకు కేవలం 2.1 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. మదనపల్లె–పుంగనూరు (8 కి.మీ), మదనపల్లె–తిరుపతి (12 కి.మీ), రాయచోటి–కడప (6 కి.మీ), వాల్మీకిపురం–పీలేరు (5 కి.మీ) రహదారుల్లో మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, వీటికి ట్రీ గార్డులు, నీటి సదుపాయం లేకపోవడంతో నాటిన మొక్కల్లో 10% ఇప్పటికే ఎండిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా పుల్లంపేట, నల్లగుట్ట, లక్కిరెడ్డిపల్లి, కేసాపురం, చౌడసముద్రం, కలికిరి, ముదివేడు నర్సరీల్లో 10 వేల నుంచి 30 వేల మొక్కలు నాటకుండా నిరుపయోగంగా ఉండిపోయాయి.
జిల్లాలోని అన్ని నర్సరీలలో మొక్కల పెంపకం సజావుగా జరిగింది. 100% లక్ష్యానికి గాను ఇప్పటికే 75% పురోగతి సాధించాం. మొక్కలు ఎక్కడా ఎండలేదు, పంపిణీ ఇంకా కొనసాగుతోంది. నేను ఈ మధ్యనే కొత్తగా బాధ్యతలు చేపట్టాను. నాటి నుండి నిధులు దుర్వినియోగం కాకుండా అత్యంత పారదర్శకంగా పనులు నిర్వహిస్తున్నాం.
– శివకుమార్,
జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారి


