సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ స్కాం ! | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ స్కాం !

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

ఖాళీ అయిన షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులపై టీడీపీనేతల కన్ను..

కూటమి ప్రభుత్వంలో

అమ్మకానికి ఆపరేటర్‌ పోస్టులు

ముఖ్యనేతల సిఫార్సులతో

సబ్‌స్టేషన్‌లోకి ఎంట్రీ

నకిలీపత్రాల కుంభకోణం

వ్యవహారంతో జారుకున్న వైనం

రాజంపేట: ఎపీఎస్పీడీసీఎల్‌ రాజంపేట డివిజన్‌ పరిధిలోని కడపజిల్లా, తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలో సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల స్కాం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వంలో సబ్‌స్టేషన్లలో ఆపరేటర్‌ పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఎపీఎస్పీడీసీఎల్‌ ఉన్నతస్థాయినుంచి ఒత్తిడి పెట్టి తమకు అనుకూలమైన వారికి ఆపరేటర్‌ పోస్టులలో భర్తీ చేయించుకున్నారు. అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించకుండా డివిజన్‌ స్థాయి ఉన్నతాధికారి ఒకరు ఏ విధంగా జాయిన్‌ చేసుకున్నారనే అనుమానాలు తలెత్తాయి. 38 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల పత్రాల విచారణకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించినట్లు చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట డివిజన్‌ ఉన్నప్పుడు సబ్‌స్టేషన్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్‌లోని రెండు నియోజకవర్గాల ముఖ్యనేతలకు షిఫ్ట్‌ ఆపరేటర్‌ నియామకంలో భాగంగా ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.8లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శలు వచ్చాయి. రైల్వేకోడూరు ముఖ్యనేత బామ్మర్ది కనుసన్నల్లో షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టుల నియామకం జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి.

నకిలీపత్రాలతో..

కూటమి ప్రభుత్వంలో నకిలీపత్రాలతో తమకు అనుకూలమైన వారిని సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌ కుర్చీల్లో కూర్చొబెట్టారనే అపవాదు మూటకట్టకుంది. వీరిలో ఎక్కువగా నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉన్నారనే విషయం ఇటీవల ఎపీ ఎస్పీడీసీఎల్‌ చేసిన విచారణలో వెల్లడైంది.ఇలాంటి వారు ముందస్తు సమాచారంతో తమ పోస్టులకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. పత్రాలను సంబంధిత విద్యాసంస్థలు వెరిఫైకి వెళ్లిన నేపథ్యంలో నకిలీ పత్రాల వ్యవహారం బహిర్గతమైంది. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్ల నియామకం అవినీతితో కూడుకున్నదన్న సమాచారం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్వేలి మండలం కందులవారిపల్లె సబ్‌స్టేషన్‌లో చేరిన నలుగురు, నకిలీపత్రాలతో చేరిన వారు విచారణ సమాచారంతో ఆ పోస్టుల నుంచి అపాయిట్‌మెంట్‌ ముందే వెనుదిరిగారు. రైల్వేకోడూరు (ఒకప్పుడు అన్నమయ్య జిల్లా )పెనగలూరు, రాజంపేట, నందలూరులో కొంతమంది షిప్ట్‌ ఆపరేటర్లపై కూడా దృష్టి సారించారు. ఇందులో కొన్ని సబ్‌స్టేషన్లలో ఉన్న వారు సర్దుబాటు కూడా చేసుకున్నట్లు తెలిసింది. విచారణ నుంచి తప్పించుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా కడప జిల్లాలో 38 అనర్హత కలిగిన షిఫ్ట్‌ ఆపరేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చీఫ్‌ మేనేజర్‌ రామచంద్రరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా అన్ని సబ్‌స్టేషన్లలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారి విద్యార్హత పత్రాలను పరిశీలించనున్నట్లు ఎపీఎస్పీడీసీఎల్‌లో ప్రచారం జరుగుతోంది.

ఎపీఎస్పీడీసీఎల్‌ సబ్‌స్టేషన్‌

తిరుపతిలోని ఎపీఎస్పీడీఎల్‌ సీఎండీ కార్యాలయం

రాజంపేట డివిజన్‌లోని రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలోనే కాకుండా జిల్లాలోని ఇతర సబ్‌స్టేషన్లలో ఖాళీ అయిన షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులపై టీడీపీ నేతల కన్నుపడింది. 2014లో టీడీపీ ప్రభుత్వంలో షిఫ్ట్‌ ఆపరేటర్‌లుగా చేరిన వారిని తొలగించి, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని నియమించాలని ఎపీఎస్పీడీసీఎల్‌ డివిజన్‌న్‌ స్ధాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీ చేయాలని ముఖ్యనేత ప్రయత్నిస్తే పచ్చ కాంట్రాక్టర్‌ అడ్డపడటం చూస్తుంటే ఏ మేరకు లావాదేవీలు కొనసాగుతున్నాయో అవగతమవుతుందని పలువురు సిబ్బంది చెబుతున్నారు. డివిజన్‌ స్ధాయి అధికారి ఓ టీడీపీ నేత పచ్చ కాంట్రాక్టర్‌తో సఖ్యతగా ఉంటూ ఇద్దరు తమకు జేబులు నింపే వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.ఈ విషయం గురించి ఏపీఎస్పీసీఎల్‌ రాజంపేట డివిజనల్‌ ఇంజినీర్‌ రాజశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా అనర్హత కలిగిన, నకిలీ ధ్రువీకరణపత్రాలతో పనిచేసే షిఫ్ట్‌ ఆపరేటర్లు డివిజన్‌ పరిధిలో లేరన్నారు. కడప జిల్లాలో రాజంపేట, పాత అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరులో నకిలీపత్రాలతో చేరిన షిఫ్ట్‌ ఆపరేటర్లు లేరని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement