మదనపల్లె సిటీ: రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు జరుగుతాయన్నారు. శాప్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, 1.1.2008 నుంచి 1.1.2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. క్రీడాకారులు https:// sports.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మదనపల్లె ఆర్‌ఓకు
స్టేషన్ బెయిల్
బి.కొత్తకోట: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్‌ఓ) జీవి. పల్లవికి స్టేషన్ బెయిలు ఇచ్చామని స్థానిక సీఐ గోపాల్ రెడ్డి సోమవారం చెప్పారు. హైకోర్టులో నడుస్తున్న ఓ కేసుకు సంబంధించి పల్లవి ఆన్ లైన్ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాంతో పల్లవి పోలీస్ స్టేషన్లకు వచ్చి సొంత పూచికత్తు సమర్పించగా బెయిల్ ఇచ్చినట్టు సిఐ చెప్పారు. ఈనెల 30న హైకోర్టులో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవుతానని ఈ మేరకు ఆమె అఫిడవిట్ ఇచ్చారని సిఐ చెప్పారు. హైకోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని ఈ మేరకు ఆర్‌ఓకు స్పష్టం చేసినట్లు సీఐ తెలిపారు.
రేపటి నుంచి
ఇజితిమా ధార్మిక సభలు
కలికిరి: కలికిరి సమీపం మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలకు సంబంధించి అన్నమయ్య జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో జమాత్ సభ్యులు సుమారు రెండు మాసాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్నారు.దీంతో ఏపీఐఐసీ స్థలంలో మైదానాన్ని చదును చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరవ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ ధార్మిక సభలకు ఉన్నత స్థాయి ఇస్లాం బోధకులు, మత గురువులు హాజరై ధార్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం రాత్రి దువా ప్రార్థనలతో ఇజితిమా కార్యక్రమం ముగియనుంది.
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం మదనపల్లె అర్బన్‌హెల్త్ సెంటర్ లో ఐసీటీసి, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్‌టీ డాక్టర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మిషన్ ఎయిడ్స్ సురక్షా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. క్లస్టర్ ఇన్‌చార్జి భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–తిరుపతి మధ్య తి రుగుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తె లియజేశారు. ఆసక్తి, అర్హులైన వారు తమ ఆధార్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (18 నెలలు పూర్తయి ఉండాలి), ఆర్టీవో క్లియరెన్స్, 8వ తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫో టోలతో తిరుపతిలోని అలిపిరి డిపోకు రావాలని తెలిపారు. ఇతర వివరాలకు 73828 74600, 99598 53427 నంబర్లలో సంప్రదించాలన్నారు.


