ఇళ్లు ఇవ్వకపోతే అద్దెలు కట్టండి | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు ఇవ్వకపోతే అద్దెలు కట్టండి

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

టిడ్కో గృహాలు ఎప్పుడు ఇస్తారు?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

మదనపల్లె : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో వారు ఉంటున్న అద్దె ఇళ్లకు అద్దె చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తానని చంద్రబాబు చెప్పి మోసం చేశారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో లక్షల దరఖాస్తులు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే ఇంత వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. 6.50 లక్షల పింఛన్లు తొలగించి కొత్త పింఛన్లు ఒకటీ ఇవ్వలేదన్నారు. తీసుకుంటున్న వాళ్లు చనిపోతే కానీ.. కొత్త పింఛన్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. విద్యుత్‌ ట్రూ ఆఫ్‌ చార్జీలు పెంచి కరెంట్‌ బిల్లులు బాదుతున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు అప్పగిస్తారని నిలదీశారు. మంత్రి నారాయణ మాటలు నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లు విమానాల్లో తిరుగుతూ ఖజానా కొల్లగొడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో పేదలు రెండేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా, వాటిని పట్టించుకునే దిక్కు లేదన్నారు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరికీ పట్టడం లేదన్నారు. బి.కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో 1,050 మందికి ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపలేదన్నారు. ఆన్‌లైన్‌లో కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదని అన్నారు. ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీలో 200 ఎకరాల సోత్రియం భూములను భూస్వాముల నుంచి రెవెన్యూ యంత్రాంగం కాపాడి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్‌, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్‌రెడ్డి, సాంబశివ, సిద్ధిగల శ్రీనివాసులు, సుమిత్రమ్మ, టీఎల్‌ వెంకటేష్‌, కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంగిమల్ల రంగారెడ్డి, సలీం బాషా, జక్కల వెంకటేష్‌, హరికుమార్‌, తరుణ్‌, రెడ్డి శేఖర్‌, నరేష్‌, సూరి, తిరుమల, దేవా, రఘునాథ్‌, అంజనప్ప, జగన్‌బాబు, అంజి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement