ప్రజల మనిషి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్రజల మనిషి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

ఆయన వ్యక్తిత్వం మహోన్నతం

మైదుకూరు మాజీ

శాసనసభ్యుడు రఘురామిరెడ్డి

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కోసం పని చేసే నాయకుడిగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేరు పొందారని మైదుకూరు మాజీ శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులోని తమ స్వగృహంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యక్తిత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ తవ్వా వెంకటయ్య రాసి, వ్యాఖ్యానించి, రూపొందించిన డిజిటల్‌ డాక్యుమెంటరీని రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై కొందరు రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలు, తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారికి వెంకటయ్య రూపొందించిన డాక్యుమెంటరీ కనువిప్పు కలిగిస్తుందన్నారు. వైవీయూ పాలక మండలి సభ్యుడు, జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తన శిష్యుడు తవ్వా వెంకటయ్య వైఎస్‌ కుటుంబం పైన అపారమైన అభిమానం ఉన్నవాడని, గత ఎన్నికల సమయంలో అవినాష్‌రెడ్డి పైన పాట రాసి, తానే స్వయంగా గానం చేశారని అన్నారు. ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో.. వారి నోళ్లు మూయించడానికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో కళ్లకు కట్టినట్టు డాక్యుమెంటరీ రూపొందించి, వ్యాఖ్యానించారన్నారు.

వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లో..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ ఎవరికి కీడు చేయకుండా ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి తన అన్న జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచే గొప్ప ప్రజా నాయకుడు అవినాష్‌రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవరెడ్డి మాట్లాడుతూ భూమికి ఎంత సహనం, ఓర్పు ఉందో అవినాష్‌రెడ్డికి అంతటి ఓర్పు, సహనం ఉన్నాయని అన్నారు. అవినాష్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి కడప జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఆయన అక్కలైన సునీతమ్మ, షర్మిలమ్మకు తెలియకపోవడం శోచనీయం అన్నారు. తవ్వా రూపొందించిన వీడియో ద్వారా అయినా వాళ్లు ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి తనకు మొట్టమొదట రాజకీయాలు పరిచయం చేశాడని, ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైందన్నారు. అనంతరం వారు డాక్యుమెంటరీ రూపకర్త తవ్వా వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త జింకా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ వింగ్‌ కార్యదర్శి నారాయణరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నాగేశ్వర్‌ రెడ్డి, తవ్వారుపల్లె మాజీ సర్పంచ్‌ అమరేశ్వర్‌రెడ్డి, మైదుకూరు నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, మైదుకూరు మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రవి, సుబ్బరాయుడు యాదవ్‌, మైలవరం మండల కన్వీనర్‌ మహేశ్వరరెడ్డి, సుబ్బారావు, ముద్దనూరు మండల నాయకులు శివప్రసాద్‌, ప్రొద్దుటూరు పార్టీ అభిమానులు రాజేష్‌, ఆల్‌ప్రైడ్‌, ఓబులేసు, మోషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement