మావిగన్‌–అమరావతిపై ప్రజలు ఆలోచించాలి | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌–అమరావతిపై ప్రజలు ఆలోచించాలి

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

ఏది మేలో నిర్ణయం తీసుకోవాలి

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

జమ్మలమడుగు : రాష్ట్ర రాజధానిగా మావిగన్‌–అమరావతిలలో ఏది మేలో ప్రజలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా నది ప్రాంతంలో అమరావతి నిర్మాణం జరగుతోందని, ఏటా రాజధానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో, ఆ నీటిని ఎత్తిపోయటానికి ప్రతి ఏడాది 600 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మావిగన్‌ పేరుతో ప్రతిపాదించిన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో జాతీయ రహదారులతోపాటు గన్నవరం ఎయిర్‌ పోర్టులు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో నిర్మిస్తే మనకు ఒక రాజధాని త్వరగా ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అవుతోందని, ఇంత వరకు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజధానిని కొత్తగా ఏర్పాటు చేయాలంటూ.. లక్షల కోట్ల అవసరం అని కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. అంత డబ్బులు అప్పులు తీసుకుని వచ్చి రాజధాని నిర్మాణం చేపడితే, తీర్చడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అమరావతిలో పెట్టే ఖర్చులో, 20 శాతం పెడితే మావిగన్‌ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు.

ఏబీఎన్‌ వార్తలు సరికావు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మావిగన్‌ను సూచన చేస్తే.. దానిపై చర్చించాల్సింది పోయి మీడియా ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత దిగజారి కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో వార్తలు ప్రసారం చేయడం దారుణమన్నారు. ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని, మావిగన్‌ వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుందా, లేదా అమరావతి లక్షల కోట్లు రూపాయలు అప్పులు తెచ్చి నిర్మించుకోవడం కరెక్టా అని సూచించారు. బాధ్యతాయుమైన జాతీయ పార్టీలో ఉన్న వైఎస్‌ షర్మిల.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గొడ్డలి అంటూ వెటకారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. నిజంగా షర్మిల జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థానంలో ఉండి మావిగన్‌పై ఒక కమిటీని ఏర్పాటు చేయించి, ఏది మంచిదో తెలుసుకోవాలని తెలిపారు. కేవలం చంద్రబాబు మాయలో పడి వారి ప్రాపగండం కోసం పాకులాడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, వద్దిరాల రామాంజనేయుల యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement