మదనపల్లె టౌన్ : తల్లీకుమారులపై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం వేపూరి కోటకు చెందిన దంపతులు రవణమ్మ, చెంగల్‌రాయుడుల కుమారుడు శంకరప్ప తన ఇంటి నిర్మాణం కోసం పునాది రాళ్లను ఇంటి ముందు తోలుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తన ప్రత్యర్థులు గుడికి వెళ్లే దారిలో రాళ్లను అడ్డంగా తోలాడనే సాకుతో శంకరప్పపై గొడవకు దిగారు. కొడుకుతో గొడవ పడుతుండటం గమనించిన రవణమ్మ వెళ్లి అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన వెంకటరమణ, రామచంద్ర, ఓబులప్ప, అప్పళ్ల, కిట్ట, రవి, ఆది తదితరులు రవణమ్మ ఇంటి పైకి వచ్చి గేట్లు విరచి తల్లీబిడ్డలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన బాధితులను కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.


