దివ్యాంగుడు శంకర్‌ది హత్యే | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడు శంకర్‌ది హత్యే

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై అనుమానాస్పద స్థిలో మృతి చెందిన దివ్యాంగుడు శంకర్‌ ది హత్యేనని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ కొత్తపల్లె పంచాయతీ కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్‌(45) ఆదివారం స్థానిక తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీటి తొట్టి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటం తెలిసిందే అన్నారు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం అందించగా వెంటనే వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. అయితే మృతుడి తల్లి రత్న ఇచ్చిన ఫిర్యాదులో ఆటో డ్రైవర్‌ సాదిక్‌, వినయ్‌ కాంత్‌లు తన బిడ్డను సిటిఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపం వద్దకు తీసుకెళ్లి వారే చంపేసి ఉంటారని పేర్కొనడంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. అంతే కాకుండా డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి శంకర్‌ ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, బలంగా కొట్టడంతో తలకు దెబ్బతగిలి ప్రాణాలు కోల్పోయాడని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో దివ్యాంగుడు శంకర్‌ ది అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడం జరిగిందన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement