పనిలేని పర్యాటకశాఖ | - | Sakshi
Sakshi News home page

పనిలేని పర్యాటకశాఖ

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

జిల్లా పరిధిలో హార్సిలీహిల్స్‌ ఒక్కటే యూనిట్‌

ఇది తిరుపతి డీవీఎం పరిధిలోకి వస్తుంది

ఇక్కడి జిల్లా అధికారులకు పనిలేదు

మదనపల్లె : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పర్యాటకశాఖకు ఇప్పుడు పని లేకుండా పోతోంది. అంతేకాదు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. రూ.కోట్లాది ఆదాయంతో కళకళలాడిన టూరిజం యూనిట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పర్యాటకశాఖపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ శాఖ మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో ఇంకెలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనని అధికారులు, శాఖను నమ్ముకుని జీవిస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు ఒక్కటే

అన్నమయ్య జిల్లాలో పర్యాటక ప్రాంతాలు లేవు. ఉన్న ప్రాంతాలను పర్యాటకశాఖ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. దీంతో జిల్లా స్థాయిలో ఉన్న పర్యాటకశాఖకు ఏమాత్రం పని లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న ఏకై క పర్యాటక ప్రాంతం హార్సిలీహిల్స్‌. ఇది బి.కొత్తకోట మండల పరిధిలోకి వస్తుంది. పాలనాపరంగా తిరుపతి పర్యాటకశాఖ డివిజన్‌ పరిధిలో ఉంది. అన్నమయ్య జిల్లాకు ఒక పర్యాటక అధికారిని, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను నియమించగా వీరికి ఒక కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అధికారి ఉన్నారన్న మాటేకాని చేతికి పనిలేదు. జిల్లా అధికారి పరిధిలో పర్యాటక ప్రాంతాలు లేవు. పీలేరు, బోయకొండ కొన్నిచోట్ల పర్యాటకశాఖ అతిథి గృహాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది కానీ ఇంతవరకు వాటి మంజూరు జరగలేదు. దీంతో అధికారులతో పని లేక కార్యాలయంలో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది.

ప్రైవేటుకు అప్పగింత

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి డివిజనల్‌ అధికారి టూరిజం యూనిట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఈ అధికారి పరిధిలోని ముఖ్యమైన టూరిజం యూనిట్లను ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) పేరుతో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, నగరి టూరిజం యూనిట్లు, తిరుపతిలోని అలిపిరి హోటల్‌ను ఓ అండ్‌ ఎం పద్ధతిలో ప్రైవేట్‌ వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పుడు పర్యాటకశాఖ పర్యవేక్షణలో ఇవి లేవు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టూరిజంకు కేటాయిస్తున్న దర్శనం టికెట్లను రద్దు చేయడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. దర్శనం టికెట్ల ఆధారంగా టూరిజం రవాణా శాఖ కోట్లాది ఆదాయం అర్జించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రవాణ యూనిట్‌ దారుణంగా దెబ్బతింది. రూ.కోట్ల నష్టం రావడమే గాక నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కష్టతరమైంది. తిరుమలలో టూరిజంకు కేటాయించిన అతిథి గృహాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. దాంతో డివిజన్‌ కార్యాలయానికి పని భారం తగ్గిపోయింది.

ఉన్నవి ఇవే

తిరుపతి డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్‌, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలోని పులిగుండు, కై లాసనాథకోన యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో హార్సిలీహిల్స్‌, శ్రీకాళహస్తి మాత్రమే ఆదాయంలో ముందున్నాయి. మిగిలిన మూడు యూనిట్ల ఆదాయం అంతంత మాత్రమే. దీంతో పర్యాటక శాఖ పూర్వ వైభవం కోల్పోయి కళ తప్పింది.

హార్సిలీహిల్స్‌పై నిర్లక్ష్యం

అన్నమయ్య జిల్లాలో ఉన్నది ఒకే ఒక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌. దీని అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. వస్తున్న ఆదాయం తీసుకోవడమే తప్ప అభివృద్ధి కోసం తిరిగి నిధులు ఇవ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అతిథిగృహాల ఆధునికీకరణకు రూ.10 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులపై నిర్లక్ష్యం చూపడమే గాక తీవ్ర జాప్యం చేసింది. దాని ఫలితంగా పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వస్తున్న రూ.కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. వేతనాలు, ఖర్చుకు తప్ప అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా హార్సిలీహిల్స్‌ యూనిట్‌ కూడా కళతప్పే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement