మదనపల్లె టౌన్ : మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. స్థానిక తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొన్నేటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలికి చెందిన వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దైపెన పడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు బాధితున్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నేడు వైఎస్ అవినాష్ రెడ్డిపై డాక్యుమెంటరీ ఆవిష్కరణ
కడప ఎడ్యుకేషన్ : వైఎస్ అవినాష్‌రెడ్డి పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ తవ్వా వెంకటయ్య డాక్యుమెంటరీ రూపొందించారు. ఏడు నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీని సోమవారం మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ వర్తమాన రాజకీయ నేతలలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో బయట ప్రపంచానికి తెలియ చెప్పడానికి దీనిని రూపొందించామన్నారు. షర్మిల కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది‘అన్నట్లు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప జిల్లా ప్రజలకు గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలిసేలోపు ఆయన గురించి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఖండిస్తూ ఆయన గురించి వాస్తవాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తవ్వా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి, గౌరవ అతిధిగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆత్మీయ అతిథిగా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారని చెప్పారు.
ఆర్టీపీపీలో లైనర్ల ప్లేట్లు చోరీ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కోల్ ప్లాంట్‌లో ఉన్న లైనర్ ప్లేట్లు (ఇనుప ప్లేట్లు) చోరీకి గురయ్యాయి.వీటిని స్టేజీ–1లోని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. కోల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు అదివారం తెల్లవారుజామున మూడు లైనర్ ప్లేట్లను దొంగతనం చేసి స్కూటీలో తీసుకెళుతుండగా ఆర్టీపీపీ విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్ తన సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. స్కూటీని, ఇనుపప్లేట్లను కలమల్ల పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. కలమల్ల ఎస్‌ఐ మాట్లాడుతు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గతనెల 24వ తేదీన గుర్తు తెలియని మహిళ (36) అనారోగ్యంతో వైద్యసేవలకు వచ్చింది. ఈనెల 10వ తేదీన మృతి చెందింది. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రిమ్స్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.


