మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై బాధితులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ. ఆవులపల్లెకు చెందిన వెంకటేష్, గంగరాజు, శివలు బైక్‌లో స్థానిక టమాటా మార్కెట్‌యార్డు వద్ద ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు వెళుతుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం గంగరాజుకు కాలు విరగడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు నిలపకుండా వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని..
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీకి చెందిన వాసిఫ్ (30) ద్విచక్రవాహనంలో తలపులకు బయలుదేరాడు. ముందు వెలుతున్న ఆటోను ఓవర్‌టేక్ చేయబోయి తలపుల నుంచి పీలేరు వైపు ఎదురుగా వచ్చిన కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాసిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం ఆయన్ను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో..
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వినుకొండకు చెందిన తిరుపాల్ కుమారుడు తిరుమల దావీదురాజు(26) బైకులో సొంతపనిపై మదనపల్లె మీదుగా పుంగనూరు రోడ్డులో వెళుతుండగా స్థానిక తట్టి వారిపల్లె బైపాస్ రోడ్డులో హైవే రోడ్డు పనులు గమనించ కుండా వేగంగా వెళ్లాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్నిస్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు.


