ప్రొద్దుటూరు క్రైం : ఆత్మహత్య చేసుకున్న ఆవుల రంగస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. కుటుంబ సభ్యుల రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి, ప్రమీల అనే వివాహిత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామంలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువురూ శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగస్వామి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరుకు వచ్చారు. వారు రాగానే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ సహజీనం చేస్తున్న విషయం ఇన్ని రోజులుగా తమకు తెలియదని, ఇటీవలే తెలిసినట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులు రంగస్వామి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రమీల మృతదేహం కోసం రాని కుటుంబ సభ్యులు
ప్రమీల మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపినా వాళ్లు ఎవ్వరూ ప్రొద్దుటూరుకు రాలేదు. ఆదివారం కూడా రూరల్ పోలీసులు పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినా వాళ్లు రావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ప్రమీల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతదేహాన్ని ఆస్పత్రిలో ని మార్చురీలో భద్రపరిచారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు రాకుంటే పోస్టుమార్టం నిర్వహించి ప్రొద్దుటూరులోనే ప్రమీల మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రమీల ఇద్దరు కుమారులు ముత్తు అలియాస్ రంగస్వామి, ప్రకాష్‌లను పోలీసులు కడపలోని చైల్ట్ వెల్‌ఫేర్ కమిటీకి అప్పగించారు.


