దివ్యాంగుడు అనుమానస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుడు అనుమానస్పద మృతి

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో ఓ దివ్యాంగుడు ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలూకా పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కొత్తపల్లె పంచాయతీ, రంగారెడ్డి కాలనీ (కొత్త ఇండ్లు)కి చెందిన ఎల్‌.లక్ష్మినారాయణ కుమారుడు దివ్యాంగుడు ఎల్‌.శంకర్‌ (49) సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీళ్ల తొట్టిలో పడి చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్‌ స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్‌ కవర్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. భార్య సునీత అలియాస్‌ భారతి భర్తతో మనస్పర్థల కారణంగా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటోందని శంకర్‌ తల్లి రత్నమ్మ తెలిపింది. తనతో పాటు మనవళ్లు పవన్‌, కార్తీక్‌ లను శంకర్‌ పోషించుకుంటూ ఉన్నాడని చెప్పింది. అయితే శనివారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాని చెప్పి, తన దగ్గర రూ.200 డబ్బు తీసుకుని రాత్రి వెళ్లిన తన కుమారుడు ఆదివారం ఉదయం తట్టివారిపల్లె చెరువు కట్టపై చనిపోయి ఉన్నాడని పోలీసులు ఫోన్‌ చేసినట్లు తెలుపుతూ రత్నమ్మ విలపించింది. తలకు, శరీరంపైన బలమైన రక్త గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీక రించారని మృతుని తల్లి ఆరోపించడంతో ఎవరైనా పథకం ప్రకారం శంకర్‌ను కొట్టి చంపేసి నీళ్ల తొట్టిలో పడేసి వెళ్లారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈశ్వర్‌ మృతిపై అనుమానం ఉందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శంకర్‌ది హత్య లేక మరే ఇతర కారణాలతో మృతి చెందాడా అన్నది తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement