ములకలచెరువు : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కాలువపల్లెకు చెందిన సురేష్ స్థానికంగా ఉన్న వినాయక్‌నగర్‌లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కాలువపల్లెకు వెళ్లారు. గమనించిన దుండగులు గేటు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి అందులోని రూ. 85 వేల నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి దొంగలించారు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని గమనించి బాధితుడికి సమాచారం అందించారు. అదేవిధంగా పక్కనే ఉన్న రమణ ఇంటిలోకి జొరబడేందుకు దొంగలు ప్రయత్నించారు. కానీ ఇంట్లో మనుషులను చూసి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.


