గంజాయి ముఠా గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా గుట్టురట్టు

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

నలుగురు నిందితుల అరెస్ట్‌

రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిగడ్డల లోడు ముసుగులో భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న నలుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశా రు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువైన నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తనిఖీల్లో దొరికిపోయారు..

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి (మదనపల్లి సబ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి) పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ గుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి, అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి వ్యక్తులతోపాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయడంతో ఇటీవల స్థానిక సిటిఎం రోడ్డు, ఎరగాని మిట్టపై ఎర్రగడ్డల మాటున 179 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులను చూసి పారిపోయిన కేసులో పరారీలో ఉన్న నిందితులుగా నిర్ధారించారు. మదనపల్లి తాలూకా పోలీస్‌స్టేషన్‌లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్‌ కేసులో వీరంతా పరారీలో ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్‌, మల్లెల అమరావతితోపాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో చంద్రా కాలనీకి చెందిన వదినా మరిది నాగరాజు, సుగుణలను రిమాండ్‌కు తరలించామని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

యువత భవిష్యత్తును చిదిమేస్తే కఠిన చర్యలు

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్‌ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన మదనపల్లె తాలూకా సీఐ, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement