చిన్నమండెం : ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్ వెలుగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామంలోని బాపూజీనగర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద అమర్చిన 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారుల గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో ఆర్థికం భారం తగ్గిస్తూ శాశ్వత విద్యుత్ పరిష్కారాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా జలధార ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా జలధార ప్రాజెక్టు అమలు పరిచి అద్భుతమైన ఫలితాలు రావడానికి కృషి చేసిన కలెక్టర్ నిశాంత్‌కుమార్‌ను మంత్రి మండిపల్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బేసిన్ ఆధారిత నీటి సంరక్షణ విధానాన్ని అనుసరించి నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, మిగులు లోటు ప్రాంతాలకు మళ్లించే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 49 ఉప పరివాహక ప్రాంతాల గుర్తింపు, 532 కాస్కేడ్స్ ద్వారా 3082 చెరువుల అనుసంధానం, 962 ఎండిపోయిన చెరువుల పునరుద్ధరణ, ఉపాధి హామీ పథకం ద్వారా విస్తృత పనులు తదితర చర్యల వల్ల వృథాగా పోయే నీటిని సమర్థంగా వినియోగంలోకి తీసుకురాగాలిగారన్నారు. జలధార జలహారతి ప్రాజెక్టు అధ్యయనం చేయడానికి కేంద్రం నుంచి కూడా ఒక బృందం త్వరలో జిల్లాకు రానున్నట్లు మంత్రికి కలెక్టర్ వివరించారు.


