మదనపల్లె టౌన్ : హోటల్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మదనపల్లెలో బలవన్మరణం చెందాడు. శనివారం వెలుగు చూసిన విషాదకర ఘటనపై మృతుడి కుటుంబీకులు, రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం గుడియాతంకు చెందిన గోవిందం హరిబాబు (52) గత 20 ఏళ్ల క్రితం కుటుంబీకులతో కలసి బతుకు దెరువు నిమిత్తం మదనపల్లెకు వలస వచ్చాడు. ఆయనకు భార్య మంజుల, కుమార్తె గాయత్రి, కుమారుడు కిషోర్ ఉన్నారు. పట్టణంలోని రామారావు కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ.. స్థానిక కోట వీధిలో ఉన్న ఓ టీ హోటల్‌లో టీ– మాస్టర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం పలమనేరులో ఉన్న తన కూతురు గాయత్రి ప్రసవించడంతో హరిబాబు భార్య మంజుల కూతురు చెంతకు వెళ్లింది. కొడుకు కిషోర్ బెంగుళూరు లోని ఓ కంపెనీలో పని చేస్తుండగా, హరిబాబు ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇంతలో హరిబాబుకు ఏం కష్టం వచ్చిందో ఏమో..? జీవితంపై విరక్తి చెంది తను ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఇరుగు పొరుగు వారు గమనించి స్థానిక టూ టౌన్ పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లెకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పంచనామా చేపట్టి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


