మదనపల్లె టౌన్ : ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు తాలుకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పొన్నేటి పాళ్యం పంచాయతీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి(46)కి తన తల్లిదండ్రులకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిలో వాటా రావాల్సి ఉంది. ఈ క్రమంలో రాత్రి నాగిరెడ్డి తన అన్న చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా పంచాలని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. మాటకుమాట పెరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన చెన్నకేశవరెడ్డి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి తమ్ముడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. కుటుంబీకులు సమాచారం తెలుసుకుని వెళ్లి.. బాధితుడిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


