● దప్పిక తీర్చుకునేందుకు వచ్చి
మృత్యువాత పడుతున్న జింకలు
● అటవీ ప్రాంతాల్లో
కనీస సౌకర్యాలు కరువు
మృతి చెందిన జింక (ఫైల్)
గాయపడిన జింక పిల్ల (ఫైల్)
కందుకూరు సమీపంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు
పెద్దతిప్పసముద్రం : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కర్ణాటక రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సరిహద్దులో వున్న పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాలలో సంచరిస్తున్న వివిధ రకాల జింకలు వాహనాల్లో వెళ్లే వారికి కనువిందు చేస్తున్నాయి. ఒక వైపు మండుతున్న ఎండలు, మరో వైపు తగలబడుతున్న అటవీ ప్రాంతాల తద్వారా వన్య ప్రాణులు తల దాచుకునేందుకు కూడా సౌకర్యాలు లేవు. ఆఖరికి మూగజీవాలు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వచ్చి దప్పిక తీర్చుకుంటున్నాయి. మరి కొన్ని చోట్ల రైతుల వ్యవసాయ పొలాల వద్దకు వచ్చి గుళికల మందు కలిపిన నీళ్లు తాగి, ఇంకొన్ని రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోతున్నాయి. దీంతో రోజురోజుకు వన్యప్రాణులు కనుమరుగు అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జింకలు చనిపోతే అటవీ అధికారులు రావడం, సమీప అడవుల్లో ఖననం చేసి చేతులు దులుపుకొని వెళుతున్నారే గానీ మూగ జీవాలకు అటవీ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మండలాల్లో ఒకప్పుడు లెక్కకు మించి వున్న జింకల గుంపులు నేడు చేతి వేళ్ల మీద లెక్కించాల్సి వస్తోంది. అటవీ శాఖ వున్నా కూడా వన్య ప్రాణుల రక్షణ నామమాత్రమే. పలు చోట్ల అత్యధికంగా నివసిస్తున్న జింకలు అటవీ ప్రాంతం లేకున్నా గుట్టలనే ఆసరాగాగా చేసుకుని గడుపుతున్నాయి. జింకలను కాపాడి వాటి సంతతిని పెంపొందించే విషయంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు పీటీఎం మండలంలోని కందుకూరు, సంపతికోట, మద్దయ్యగారిపల్లి, పులికల్లు, బూచిపల్లి, పట్టెంవాండ్లపల్లి, బూర్లపల్లి, ములకలచెరువు మండలంలో సోంపాళ్యం, కదిరినాయునికోట, గూడుపల్లి, బత్తలాపురం ప్రాంతాలలో జింకలు నిత్యం సంచరిస్తుంటాయి. కనీసం ఇప్పటికై నా అటవీ అధికారులు వన్యప్రాణుల దాహార్తి కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


