మదనపల్లె : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారని, వారికి దక్కాల్సిన హక్కులను సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్‌జీఓ హోంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా రెండవ మహాసభ జరిగింది. వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పంచాయతీ కార్మికులకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీల నిధులతో కాకుండా ప్రభుత్వమే ట్రెజరీ వేతనాలు చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్మికుల తరహాలో రూ.21 వేల వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం, మృతి చెందిన కార్మికుల అంతిమ సంస్కారాలకు రూ.20 వేలు చెల్లించాలని కోరారు. పనిముట్లు, బట్టలు, కొబ్బరి నూనె, సబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై మంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించకుంటే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎస్.సురేంద్రబాబు గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చేపట్టిన కార్యకలాపాలు, నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై పలువురు ప్రతినిధులు చర్చలు జరిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. అధ్యక్షులుగా బి.వి.రమణ (పీలేరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సురేంద్రబాబు (పిటియం), కోశాధికారిగా విజయకుమార్ (కలకడ), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డి.గోపాల్ (మదనపల్లి) వీరితోపాటు ఆరుగురు ఆఫీస్ బేరర్లు, 11 మంది కమిటీ సభ్యులను మహాసభ ఎన్నుకుంది.


