కమలాపురం : మండల పరిధిలోని కోగటం గ్రామంలో గురువారం అర్ధరాత్రి మూడు ప్రైవేటు పాఠశాలలకు చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలలకు పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రతి రోజూ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులను తరలిస్తారు. పాఠశాల ముగిసిన తరువాత తిరిగి వారిని వారి గ్రామాలకు చేరుస్తారు. అనంతరం బస్సులను కోగటం గ్రామం వద్ద వున్న ఖాళీ ప్రదేశంలో వుంచి డ్రైవర్లు మాత్రం ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం యథావిధిగా విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను గమ్య స్థానాలకు చేర్చిన డ్రైవర్లు వివిధ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఐదు బస్సులను కోగటం వద్ద ఉంచి తమ ఇళ్లకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో బస్సులు మంటలకు కాలిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారం అందుకున్న కమలాపురం అగ్నిమాపక, పోలీసు శాఖ వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే మూడు బస్సులు ఆహుతి కాగా వాటి పక్కనే వున్న మరో రెండు బస్సులను పూర్తిగా కాపాడారు. దగ్ధమైన బస్సులు ప్రొద్దుటూరులోని గీతాంజలి స్కూల్, ఐడియల్ పబ్లిక్ స్కూల్, గోపీ కృష్ణ మాంటిస్సోరి విద్యా సంస్థలకు చెందినవిగా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.43 లక్షల మేర వుంటుందని పాఠశాల యాజమన్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక శాఖ అఽధికారి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కాగా ఈ సంఘటనకు కారణాలు తెలియరాలేదు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగిందా లేక బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల గానీ మరే ఇతర కారణంతో ప్రమాదం జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి వుంది.


