● ఘటనకు దారి తీసిన
దాయాదుల మధ్య గొడవ
● సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పోలీసులు
రాజుపాళెం : మండల పరిధి పర్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి బంగి మహేష్ అలియాస్ పండు (23) అనే యువకుడు కత్తిపోట్లతో హత్యకు గురయ్యాడు. అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వరుసకు దాయాదులైన మరో యువకుడితో జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా చినికి చినికి గాలి వానలాగా మారడంతో హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... మధ్యాహ్న సమయంలో మహేష్ ఎందుకు అంత స్పీడ్‌గా వెళ్తున్నావని చరణ్‌ను వారించినట్లు తెలిసింది. ఈ విషయమై అక్కడ ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఇదే విషయమై రాత్రి రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మహేష్‌ను చరణ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. అయితే మహేష్‌ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్‌రెడ్డిలు శుక్రవారం రాత్రి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అన్న కూడా ఉన్నారు. మృతుడు వృత్తి రీత్యా డ్రైవరుగా పని చేస్తున్నాడు. హత్య జరిగిందని తెలియడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


