మదనపల్లె టౌన్ : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో గొడవపడి, ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. మదనపల్లె పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు.. స్థానిక శ్రీవారి నగర్‌లో కాపురం ఉంటున్న పట్టుదారం తీసే రెడ్డి బాబు (48) అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తన భార్య ధనలక్ష్మి అనుమానం పెంచుకుంది. దీంతో భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఈ విషయమై రెడ్డి బాబు తన బావ మరుదులకు తన భార్య రాద్ధాంతం చేస్తోందని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ధనలక్ష్మి చేసిన ఘన కార్యంపై ఇంటో వాళ్లకు చెబుతావా అంటూ నిలదీసి గొడవపడింది. ఆవేశంతో ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భర్త తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో బాధితుడు వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని వైద్య చికిత్సలు పొంతున్నాడు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.


