బాబోయ్‌.. కరెంటు కోతలు | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. కరెంటు కోతలు

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

బాబోయ్‌.. కరెంటు కోతలు

రాయచోటి: విద్యుత్‌ కోతలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం పెట్టిన కోతలో తెలియదుకానీ రాయచోటిలో బుధవారం నుంచి మొదలైన విద్యుత్‌ కోతలు రాత్రి 11 గంటల వరకు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించాయి. నిమిషాల వ్యవధిలోనే సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు జనాలను రోడ్డుపై పరుగులు తీయించాయి. అసలే సూర్యుడి ప్ర‘తాపా’నికి ఉడికిపోతుంటే దీనికితోడు విద్యుత్‌ కోతలు భయపెట్టిస్తున్నాయి. నాణ్యమైన నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తా మని కూటమి ప్రభు త్వం చెబుతున్న మాటలు స్థానికంగా జరుగుతున్న విద్యుత్‌ సరఫరా కోతలకు పొంతన లేకుండా పోతోంది. ఇళ్లల్లో నుంచి బయటకు రాని వృద్దులు, అనారోగ్య ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉడికిపోతున్నారు. 24 గంటలు మెరుగైన విద్యుత్‌ను అందిస్తున్నామని ప్రలోభాలు పలుకుతుంటే రాయచోటిలో మాత్రం అందుకు భిన్నంగా సరఫరా అవుతోంది. ఓ వైపు కొత్తపేట, జగదాంబ సెంటర్‌, కొత్తపల్లి, ఎస్‌ఎన్‌ కాలనీ తదితర ప్రాంతాలలో లోఓల్టేజీ సమస్యతో గంటకు పది సార్లకుపైగా సరఫరాలో అంతరాయాలు కనిపించాయి.

మూల్యాంకనకు తప్పలేదు....

అన్నమయ్య జిల్లా పరిధిలోని పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల దిద్దు బాటు కూ కరెంటు కష్టాలు తప్ప లేదు. రాయచోటిలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న మూ ల్యాంకన కేంద్రంలో విద్యుత్‌ సరఫరాలో నెలకొంటున్న అంతరాయం అక్కడి ఉపాధ్యాయులకు చెమటలు పట్టిస్తున్నాయి. 19 గదులలో జరుగుతున్న మూల్యాంకనానికి సరఫరాలో అంతరాయం అడుగడుగునా కనిపించింది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉండటంతో ఆన్‌లైన్‌ అప్‌లోడుకు సర్వర్‌ సమస్యగా మారింది. దీంతో మూల్యాంకనానికి వచ్చిన ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విద్యుత్‌ సమస్య పరిష్కారంలో స్థానిక సిబ్బంది సహకారం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం సమస్యను ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణం రాయచోటి ట్రాన్స్‌కో ఈఈను ఆదేశించారు. ఎస్‌ఈ ఆదేశాలతో స్థానిక ట్రాన్స్‌కో అధికారులు మూల్యాంకన కేంద్రానికి వెళ్లి అక్కడ నెలకొన్న సమస్యను చక్కబెట్టారు. స్థానికంగా ఏర్పడుతున్న చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోని సిబ్బంది, ఆపై స్థాయి అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కరెంటు కష్టాలు అధికమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై రాయచోటి ట్రాన్స్‌కో ఈఈ లివింగ్‌ స్టన్‌ డేవిడ్‌ను వివరణ కోరగా 11కేవీ లైన్‌ తెగి ట్రాన్సుఫారమర్‌ మీద పడటంతో సరఫరాలో సమస్యలు తలెత్తాయన్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సిబ్బంది సకాలంలో గుర్తించకపోవడంతో బుధవారం సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయన్నారు. మూల్యాంకన కేంద్రం, పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని మున్ముందు కూడా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈఈ తెలిపారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలకు అవస్థ

పది మూల్యాంకన కేంద్రానికి తప్పని తిప్పలు

రాయచోటిలో మొదలైన విద్యుత్‌ కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement