గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.16,20,150ల ఆదాయం సమకూరింది. గురువారం స్థానిక ఆలయంలో టీటీడీ సూపరింటెండెంట్ మునిబాల ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, టీటీడీ విజిలెన్స్‌అధికారి మల్లికార్జున, సిబ్బంది నాగరాజ, ఆలయఅర్చకులు గోపాలాబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్, వరదరాజ స్వాములు పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ: జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలు ఈనెల 12వతేదీ మదనపల్లె బీటీ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ బి.శివప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. క్రీడాకారులు జనన సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న జట్టు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 98800 92188 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మదనపల్లె సిటీ: మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయం(కేవీకే(లో గురువారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు ఎంపికలు జరిగాయి. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు మల్లికార్జున, సురేంద్రనాయక్, పేరెంట్స్ కమిటీ నుంచి రెడ్డప్ప, చాణక్య,ఆసిఫా సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందులో 200 సీట్లు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు.
పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసిన హజ్రత్‌జాన్‌పాక్‌షావలి బాబా, ఫకీర్‌షావలి బాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. మూ డు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు. గురువారం దర్గాను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. 11, 12వ తేదీలలో ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్, ఇంతేజుర్‌రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు జరుగుతాయని వివరించారు. బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది ముస్లింలు ఉరుసు మహోత్సవంలో పాల్గొనేందుకు దర్గా ప్రాంతం చేరుకుంటున్నారు.
మదనపల్లె: ఇళ్లు, ఆస్తుల గణన కార్యక్రమంలో గణకులు, సూపర్‌వైజర్లు పక్కాగా వ్యవహరించాలని ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో గణకులు, సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు గణన పనులపై సమగ్ర అవగాహన కల్పించారు. మొబైల్ యాప్ వినియోగంపై పరిజ్ఞానం కల్పించారు. ప్రతి గణన బ్లాక్ లోని కుటుంబాలు, గృహాలు, వాటి వివరాల ను క్రమబద్ధంగా నమోదు చేసే విధానంపై దృష్టి సారించాలని సూచించారు. భవనాలకు సంఖ్యలు కేటాయించడం, మ్యాపింగ్ చేయడం, సంబంధిత వివరాలను యాప్‌లో నమోదు చేయడం వంటి అంశాలు వివరించారు. ఈ శిక్షణ గణన ప్రక్రియను వేగవంతం చేసి, ఖచ్చితమైన సమాచారం సేకరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు. జిల్లా గణన అధికారి విష్ణుప్రియ, కమీషనర్ కే.ప్రమీల, జిల్లా అధికారి లక్ష్మీపతి పాల్గొన్నారు.


