పెద్దమండ్యం: మండలంలోని ముసలికుంటలో విద్యార్థిని మృతిపై గురువారం అధికారులు విచారణ నిర్వహించారు. కేజీబీవీలో 7 వతరగతి చదువుతున్న విద్యార్థిని మల్లీశ్వరి (13) జ్వరంతో బాధపడుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంఈవో మనోహర, సబ్‌యూనిట్ అధికారి శ్రీనివాసులు నాయక్‌లు కెజిబివిలో విచారణ నిర్వహించారు. విద్యార్థిని జ్వరంతో ఎన్ని రోజులుగా బాదపడుతోంది..ఎక్కడైనా విద్యార్థినికి చికిత్సలు చేయించారా ఆనే విషయాలపై విచారణ చేశారు. అలాగే జ్వరంతో ఇంకా ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించి విద్యార్థినులకు చికిత్స అందించారు. కాగా జ్వరంతో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను బుధవారం వారి ఇళ్లకు పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన బిడ్డ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు, తహసీల్దార్ తేజస్వికి ఫిర్యాదు చేశారు. జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో తమకు సమాచారం ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం బారిన పడిన వెంటనే తమకు సమాచారం ఇచ్చింటే తన బిడ్డను కాపాడుకొనేవాళ్లమని వారు కన్నీటి పర్వంతమయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరివర్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


