● బి.కొత్తకోట సీఎహెచ్‌సీలో
నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్
● రూ.70 లక్షల నిధులతో ప్రారంభించిన ఎంపీ మిథున్‌రెడ్డి
బి.కొత్తకోట: కోవిడ్ సమయంలో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో స్థానిక సీహెచ్‌సీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించగా ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. ఇక్కడ చేరిన కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌తో ప్రాణాలు నిలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు కోవిడ్ రోగులు మదనపల్లె, తిరుపతి వెళ్లకుండా స్థానిక సీహెచ్‌సీలోనే వైద్యం పొందేలా చేశారు. అయితే కూటమి ప్రభుత్వ రాకతో ఈ ప్లాంట్‌పై నిర్లక్ష్యం నెలకొంది. రోగులకు నిత్యం అవసరమైన ఆక్సిజన్ కోసం ప్లాంట్‌ను వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్లాంట్‌ను నిర్వహించే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంచేయడంతో ప్లాంటు నిరుపయోగమైంది. ఫలితం విలువైన పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. ప్రభుత్వం టెక్నికల్ అసిస్టెంట్‌ను నియమిస్తే ఇది వినియోగంలోకి వస్తుంది. ఈ విషయంలో స్థానికులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అధికారుల నుంచి వివరణ కోరింది. ప్లాంట్ నిర్వహణ సిబ్బంది కోసం ఖాళీల భర్తీ చేసే సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకొస్తే బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాల రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమస్యపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్‌ను వినియోగంలోకి తెవాలంటే సాంకేతిక పరిజ్ఙానం కలిగిన సిబ్బంది ఉండాలని, ఆ పోస్టును భర్తీ చేస్తే సమస్య ఉండదని చెప్పారు. ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఆక్సిజన్ సమస్య లేదని, అవసరమైనంతగా అందుబాటులో ఉందని చెప్పారు. అయినప్పటికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ఆక్సిజన్ ప్లాంటును వినియోగంలోకి తీసుకోచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


