కడప కార్పొరేషన్: విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళీ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బీసీ భవన్‌లో నిర్వహించిన 3వ రాష్ట్ర మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు, లక్షలాది వ్యవసాయ భూములకు విద్యుత్తు సరఫరా సేవలందిస్తున్న కార్మికులను దశాబ్దాలు గడుస్తున్న పర్మినెంట్ చేయకపోవడం పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ప్రోత్సహిస్తున్నాయని ఆ కారణంగానే ప్రతి ఏడు రెండు మూడు దఫాలు విద్యుత్ చార్జీలు పెంచి ప్రైవేటు వ్యక్తులకు సూపర్ లాభాలు తెచ్చి పెడుతున్నారని విమర్శించారు. విద్యుత్తు శాఖలోని ఖాళీ పోస్టులను ఇప్పటికే పని చేస్తున్న కార్మికులతోనే వారి విద్యార్హతను బట్టి భర్తీ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సర్వీస్ కాలానికి రూ. 10 లక్షలు చెల్లించాలని కోరారు. తెలంగాణ తరహా ఒక కోటి ఇన్సూరెన్‌న్స్ ఏపీలోనూ అమలు చేయాలని అన్నారు. ఈ మహాసభల్లో యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ ముజాఫర్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డి సూరిబాబు, వి సుదర్శన్‌రెడ్డి, కాంట్రాక్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ ఉపాధ్యక్షులు కే శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ అధ్యక్షులు కార్యదర్శులు సుబ్రహ్మణ్యం రాజు, సుమన్. సి పి డి సి ఎల్ కన్వీనర్ నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనిల్,పాల్గొన్నారు.


